త‌క్క‌వ వ్య‌వ‌ధిలో అతి పెద్ద పారిశ్రామిక‌వేత్త‌గా ఎదిగిన అదానీ గ్రూప్‌న‌కు గట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. గౌత‌మ్ అదానీకి నేషనల్ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ లిమిటెడ్‌(ఎన్‌ఎస్‌డీఎల్‌) ఇచ్చిన షాక్‌కు ఒక్క గంట వ్య‌వ‌ధిలో రూ.55వేల కోట్లు ఆవిర‌య్యాయి. స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో షేర్లు కుప్పకూల‌డంతో భారీ న‌ష్టం సంభ‌వించింది. అదానీ గ్రూప్‌లో పెట్టుబ‌డులు పెట్టిన మూడు విదేశీ పెట్టుబ‌డిదారుల ఖాతాల‌ను స్తంభింప‌చేసిందంటూ ఎక‌న‌మిక్ టైమ్స్ ఒక క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. ఈ వార్త‌తో అదానీ సంప‌ద‌లో రూ.55వేల కోట్లు హార‌తి క‌ర్పూరంలా క‌రిగిపోయాయి.

విష‌యం బ‌య‌ట పెట్టిన ఎక‌న‌మిక్ టైమ్స్
ఎన్‌ఎస్‌డీఎల్‌ స్తంభింపజేసిన క్రెస్టా ఫండ్‌, అల్బులా ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌,  ఏపీఎంఎస్‌ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ల‌కు అదానీ గ్రూప్‌లోని నాలుగు కంపెనీల్లో రూ.43,500 కోట్ల విలువైన షేర్లున్నాయి. మనీలాండరింగ్‌ నివారణ చట్టం ప్రకారం.. ఈ ఖాతాల యాజమాన్యానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడి చేయ‌లేదు. మే 31 లేదా అంతకంటే ముందే ఈ ఖాతాలను ఫ్రీజ్‌ చేసినట్లు ఎకనమిక్‌ టైమ్స్ త‌న క‌థ‌నంలో పేర్కొంది. ఖాతాల‌ను ఫ్రీజ్ చేయ‌డంవ‌ల్ల కొత్త సెక్యూరిటీల కొనుగోలు లేదా పాత సెక్యూరిటీల అమ్మ‌కం కుద‌ర‌దు. నూత‌నంగా అమ‌ల్లోకి వ‌చ్చిన నిబంధ‌న‌ల ప్ర‌కారం ఎఫ్‌ఐపీల కస్టమర్ డాక్యుమెంటేషన్‌ను వెల్లడించడం తప్పనిసరైంది. ఫండ్‌ మేనేజర్స్‌, కామన్‌ ఓనర్‌షిప్‌ వంటి వివరాలను కూడా క‌చ్చితంగా తెలియ‌జేయాల్సి ఉంటుంది. లేదంటే వారి డీమ్యాట్‌ ఖాతాలను స్తంభింప‌చేస్తారు. అదానీ గ్రూప్‌ విషయంలో కూడా అలాగే జరిగింది. ఆ వివరాలేవీ వెల్లడించకపోవడంతో ఈ మూడు ఎఫ్‌పీఐల ఖాతాలను ఆపేశారు.

వివ‌రాలు వెల్ల‌డి చేయ‌డానికి నిరాక‌రిస్తూ వ‌స్తోన్న అదానీ!!
వివ‌రాలు వెల్ల‌డిచేయాలంటూ అదానీ గ్రూప్‌ను కొంత‌కాలంగా ఎన్ఎస్‌డీఎల్ కోరుతూ వ‌స్తున్న‌ప్ప‌టికీ కంపెనీ నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించింది. డొల్ల కంపెనీల‌తో ఈ పెట్టుబ‌డులు పెట్టివుంటార‌నే అనుమానాలు కూడా భార‌త పారిశ్రామిక‌వ‌ర్గాల్లో వ్య‌క్త‌మ‌వుతున్నాయి. క‌నీసం వీటి వివ‌రాలు తెలియ‌జేస్తూ వెబ్‌సైట్లు కూడా లేక‌పోవ‌డం ప‌లు అనుమానాల‌కు తావిచ్చింది. గ‌త సంవ‌త్స‌రం అదానీ గ్రూప్‌ షేర్లు 200 నుంచి 1000శాతం మేర పెర‌గ‌డంపై  సెబీ దర్యాప్తు చేస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ వార్తల నేపథ్యంలో అదానీ గ్రూప్‌ షేర్లు ప‌డిపోయాయి. అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ ఎంట‌ర్ ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్‌, అదానీ టోటల్‌ గ్యాస్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌, అదానీ పవర్‌ షేర్లు పతనమయ్యాయి. దీంతో వీటి ట్రేడింగ్‌ను కొద్ది స‌మ‌యం నిలిపివేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: