నీటి కొర‌త దేశంలో ఉగ్ర‌రూపం దాల్చుతోంది. వ‌ర్ష‌పు నీటిని భూమిలో ఇంకే విధంగా పాల‌కులు, ప్ర‌భుత్వాలు చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డంతో..నీటి క‌ష్టాలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో రాష్ట్రవ్యాప్తంగా తాగునీటికి కొర‌త‌ ఏర్పడింది. ముఖ్యంగా రాజధాని చెన్నైలో సమస్య తీవ్రంగా ఉంది.చెన్నై శివారులోని పలు ఐటీ సంస్థలు, ప్రముఖ కంపెనీలు తాగునీరు లేక క్యాంటీన్లను మూసివేస్తున్నాయి. అంతేకాక సిబ్బందిని ఇంటి నుంచే భోజనం, తాగునీరు, వాడి పారేసే ప్లాస్టిక్‌, పేపర్‌ ప్లేట్లు తెచ్చుకోవాలని కూడా సూచిస్తున్నాయి. ఓ ప్రముఖ హోటల్‌ గ్రూపు యాజమాన్యం కూడా నీటి సమస్య పరిష్కారమయ్యేవరకు భోజనం తయారీ పూర్తిగా నిలిపేస్తున్నట్లు తెలిపింది.


చెన్నైకి నీటిని అందించే పూండి, పుళల్‌, చోళవరం, చెంబరంబాక్కం, రెడ్‌హిల్స్‌, వీరాణం తదితర జలాశయాలు దాదాపు అడుగంటాయి. వానలు కురవకపోవడం, భూగర్భజలాలు పడిపోవడం, తెలుగు గంగ పథకం కింద చెన్నైకి రావాల్సిన కండలేరు జలాలు కూడా సరఫరా కాకపోవడం లాంటి కారణాలతో నీటి ఎద్దడి తారస్థాయికి చేరింది. కార్పొరేట్ కంపెనీలు సైతం నీటి ఎద్దడిని తట్టుకోలేక… అసాధారణ నిర్ణయాలను తీసుకోవాల్సి వస్తోంది. ఆఫీసులో నీళ్లు లేవు. ఇంటికెళ్లి అక్కడి నుంచి పనిచేసుకోవాలంటూ ఓ ఐటీ కంపెనీ తన ఉద్యోగులను కోరింది. ఇదే రీతిలో ఇంటి నుంచి పని చేయాలంటూ పలు కంపెనీలు తమ ఉద్యోగులను కోరుతున్నాయి. తాజా ప‌రిణామాలు భ‌విష్య‌త్‌పట్ల భ‌యాన్ని క‌లిగిస్తున్నాయ‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు. జ‌ల వ‌న‌రుల ప‌రిర‌క్ష‌ణ‌ గురించి ఇక నుంచైనా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ప‌లువురు పేర్కొంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: