టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు విజ‌న్ ఉన్న నాయ‌కుడిగా పేరుంది. అంతేకాదు, 40 ఏళ్ల సీనియార్టీ ఆయ‌న సొంతం. మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా చేసిన అనుభ‌వం ఉంది. అనేక మంది నాయ‌కుల‌తో క‌లిసి ఆయ‌న ప‌నిచేశారు. మరి ఈ అనుభ‌వం ఇప్పుడు ప‌నిచేస్తోందా? ఆయ‌న ఏమేర‌కు త‌న అనుభ వాన్ని వాడుకుంటున్నారు? రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఆయ‌న ఏమైనా సూచ‌న‌లు ఇస్తున్నారా? ఇదీ.. ఇప్పుడు మేధావుల మ‌ధ్య జ‌రుగుతున్న చ‌ర్చ‌. ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఉద్యోగులు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌భుత్వం త‌మ‌కు ప్ర‌క‌టించిన పీఆర్సీ కార‌ణంగా వేత‌నాలు త‌గ్గుతున్నాయ‌ని చెబుతున్నారు.

పాత జీతాలే ఇవ్వాల‌నే డిమాండ్ కూడా చేస్తున్నారు. అన్ని ఉద్యోగ సంఘాలు కూడా ఏక‌తాటిపైకి వ‌చ్చాయి. ప్ర‌భుత్వంపై తీవ్ర ఒత్తిడి పెంచాయి. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. మ‌రో వైపు ప్ర‌భుత్వం కూడా తాము వెన‌క్కి త‌గ్గేదిలేద‌ని చెబుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. దీంతో ఇది ఎప్ప‌టికి ప‌రిష్కారం అవుతుంద‌నేది ఎవ‌రూ చెప్ప‌లేక పోతున్నారు. పోనీ.. న్యాయ‌పోరాటం చేస్తారా?  అంటే.. ఉద్యోగులు కోర్టుకు వెళ్లే వ‌ర‌కు తాము మౌనంగానే ఉంటామ‌ని ప్ర‌భుత్వం చెబుతోంది.వాస్త‌వానికి ప్ర‌భుత్వం ప‌క్షాన కోర్టుకు వెళ్లే అవ‌కాశం కూడా లేదు. వెళ్తే ఉద్యోగులే వెళ్లాలి. అలా వెళ్లినా.. వారికి న్యాయం జ‌ర‌గ‌దనే భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

ఈ నేప‌థ్యంలో తెగ‌దు-సాగ‌దు.. అన్న‌ట్టుగా ఉన్న ఈ ప‌రిస్థితి నుంచి ప్ర‌స్తుతం ఉన్న ఆందోళ‌న‌లను త‌గ్గించే నాథుడు క‌నిపించ‌డం లేదు. సినిమా ఇండ‌స్ట్రీ ఎలా అయితే..ఇరుకున ప‌డిందో ఇప్పుడు ఉద్యోగులు కూడా స‌ర్కారు విష‌యంలో ఎదురు చూడ‌డం త‌ప్ప ఏమీ చేయ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. మ‌రి ఈ స‌మ‌యంలో సీనియ‌ర్ నాయ‌కుడిగా చంద్ర‌బాబు జోక్యం చేసుకుంటే బాగుంటుంద‌నే వాద‌న తెర‌మీదికి వ‌స్తోంది. త‌నే ఒక‌టి రెండు మెట్లు దిగి.. ఇటు ఉద్యోగులు.. అటు ప్ర‌భుత్వంతో చ‌ర్చించి.. ఒక సానుకూల ప‌రిష్కారం చూపిస్తే.. చంద్ర‌బాబు ఇమేజ్ మ‌రింత పెరుగుతుంద‌ని.. అంటున్నారు.

అయితే.. ఆదిశ‌గా చంద్ర‌బాబు ఆలోచ‌న చేయ‌డం లేదు. దీంతో వ‌చ్చిన అవ‌కాశాన్ని చంద్ర‌బాబు స‌ద్వినియోగం చేసుకోవ‌డం లేదా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అయితే అదే స‌మ‌యంలో ఉద్యోగులు కూడా చంద్ర‌బాబు తాను పెద్ద‌రికం చేయాల‌ని అనుకున్నా ఎంత వ‌ర‌కు న‌మ్ముతారు ? అన్న‌ది చెప్ప‌లేం. గ‌తంలో ఆయ‌న ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ను ఎన్నో ఇబ్బందులు పెట్టార‌న్న అప‌వాదు ఎదుర్కొన్నారు. అందుకే గ‌త ఎన్నిక‌ల్లో ఉద్యోగులు వ‌న్‌సైడ్‌గా జ‌గ‌న్‌కు ఓట్లేశారు. ఏదేమైనా చంద్ర‌బాబు ఉద్యోగుల విష‌యంలో ఏం చేసినా.. చేయ‌క‌పోయినా ఇబ్బందులు త‌ప్పేలా లేవు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: