ఏపీ బీజేపీలో కుమ్ములాట మొదలవబోతుందా..? ఆ పార్టీ సీనియర్ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరికి చెక్ పెట్టబోతున్నారా..? సొంత నేతల మీదనే పురంధేశ్వరి తన మాటల తూటాలను పేల్చబోతున్నారా..? అసలు ఏపీ బీజేపీలో ఇలాంటి పరిస్థితి ఎందుకు నెలకొంది..? దీనికి కారకులేవరు..? అనే అంశాలను పరిశీలిస్తే..

 

తాజాగా.. ఏపీలో కుటుంబ రాజకీయాల వల్ల రాష్ట్రాభివృద్ధి ఏళ్లుగా కుంటుపడిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. కుటుంబ రాజకీయాలకు ఏపీని నెలవుగా మార్చేశారని అన్నారు. అలాగే ‘దేశం కోసం ప్రాణాలర్పించిన టంగుటూరి ప్రకాశం పంతులు, వీరేశిలింగం మహానాయకులు. వీరికంటే ఎన్టీఆర్, వైఎస్, చంద్రబాబు, జగన్.. గొప్ప నాయకులేం కాదు. వీరు నలుగురితో ఏపీకి నాలుగు గ్రహణాలు పట్టాయి. కరప్షన్, క్యాస్ట్, కుటుంబం, కుహనా రాజకీయాల నుంచి ఏపీని తప్పించాలంటే ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ అవసరం. రాష్ట్రంలో కుటుంబ రాజకీయాలకు ప్రజలు ఇప్పటికైనా స్వస్తి పలకాలి’ అని జీవీఎల్ తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పుకొచ్చారు.

 

అయితే అసలు రచ్చ ఇక్కడే మొదలైంది. జీవీఎల్, ఎన్టీఆర్ ని విమర్శించడంతో ఆయన కూతురు దగ్గుబాటి పురంధేశ్వరి బాగా హార్ట్ అయ్యారని తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు రాష్ట్ర రాజకీయ పరిస్థితులను చూసుకుంటే ఎన్టీఆర్ ను ఎవరూ విమర్శించలేదు.. పార్టీలకు అతీతంగా ఆయనను అందరూ గౌరవిస్తారు. ఇది ముమ్మాటికి నిజం. ఆఖరికి కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలు సైతం ఎన్టీఆర్ కి చాలా గౌరవం ఇస్తారు. మరి అలాంటి ఎన్టీఆర్ ను కూడా మిగిలిన నేతలతో కలిపి జీవీఎల్ విమర్శించడంతో పురంధేశ్వరి అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తుంది. దీనికి సమాధానంగా త్వరలోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి జీవీఎల్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేందుకు పురంధేశ్వరి సిద్దామవుతున్నారని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

 

మరోవైపు మాత్రం దీనికి భిన్నంగా మాట్లాడుతున్నారు కొందరు. గత కొద్దిరోజులుగా పురంధేశ్వరి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంలేదు. పైగా ఆమె తన కొడుకు సమానుడైన నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తు కోసం టీడీపీలో చేరబోతున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీంతో కేంద్ర పెద్దల అనుమతితోనే జీవీఎల్, పురంధేశ్వరికి పొమ్మనలేక పొగపెడుతున్నట్టు తెలుస్తుంది. ఒక వేల పురంధేశ్వరి గనుక జీవీఎల్ వ్యాఖ్యలపై స్పందించి ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే క్రమశిక్షణ ఉల్లంఘనల కింద ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చూస్తున్నట్టు వినికిడి. చూద్దాం మరి పురంధేశ్వరి రాజకీయ భవిష్యత్తు ఎలా మలుపు తిరగబోతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: