కరోనా ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే కుదేలు చేసింది. అన్ని రంగాలూ కరోనా బారిన పడి తలకిందులయ్యాయి. అంచనాలన్నీ తప్పి పోయాయి. లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. కోట్ల మంది జాతకాలు తారుమారయ్యాయి. ఇది ఒక్క ఇండియాలోనే కాదు.. ప్రపంచం అంతా ఇలాగే ఉంది. అయితే ఇంతటి సంక్షోభ సమయంలోనూ ఇండియా ఓ విషయంలో మాత్రం కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికీ ఇండియా మూలాలు బలంగానే ఉన్నాయని చాటి చెప్పే ఓ వాస్తవం కేంద్రం తాజాగా వెల్లడించిన గణాంకాలు చాటి చెబుతున్నాయి.

అవును మరి.. కరోనా సంక్షోభ సమయంలోనూ ఈ ఏడాది ఆహారధాన్యాల ఉత్పత్తి గతేడాది కంటే ఎక్కువగా ఉండబోతోందట. 2020-21 ఖరీఫ్ సీజన్ లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 144.52 మిలియన్ టన్నులుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చెబుతున్నారు. సీఐఐ సంస్థ  నిర్వహించిన డిజిటల్ సమావేశంలో పాల్గొన్న  కేంద్ర మంత్రి తోమర్ చెరకు, పత్తి పంటల ఉత్పత్తి కూడా మెరుగ్గా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వం  అధికారిక లెక్కల ప్రకారం గత సంవత్సరం ఖరీఫ్ సీజన్ లో ఆహారధాన్యాల ఉత్పత్తి 143.28 మిలియన్  టన్నులుగా ఉంది. ఈ ఖరీఫ్ లో తృణధాన్యాల ఉత్పత్తి మాత్రం కొద్దిగా తగ్గే అవకాశం ఉందని కేంద్ర మంత్రి తోమర్ చెప్పారు. కరోనా సంక్షోభ సమయంలోనూ  ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గొచ్చని అంతా అనుకున్నారు. కానీ తగ్గకపోగా.. ఈ ఏడాది ఖరీఫ్ సాగు 4.51 శాతం పెరిగినట్లు కేంద్రం చెప్పిన లెక్కలు చెబుతున్నాయి.

ఈ లెక్కలతో ఇండియా బలం ఏంటో మరోసారి వెల్లడించింది. సేవా రంగం ఎంతగా పుంజుకున్నా.. వ్యవసాయం భారత ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభమన్న విషయంలో మరోసారి రుజువైపోయింది. ఆర్థిక వ్యవస్థ క్షీణంచిన 2020-21 మొదటి త్రైమాసికంలోనూ ఈ రంగం 3.4 శాతం వృద్ధి నమోదు చేసింది మరి. మళ్లీ ఇండియా ప్రపంచ ఆర్థిక రంగంలో తన సత్తా చాటాలంటే అందుకు వ్యవసాయ రంగమే దిక్కు అని ఈ లెక్కలు చెప్పకనే చెబుతున్నాయి కదా.

మరింత సమాచారం తెలుసుకోండి: