అమరావతికి అనుకూలంగాను వ్యతిరేకంగాను ఉద్యమాలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే మూడు రాజధానులకు మద్దతుగా దీక్షలు చేస్తున్న బహుజన పరిరక్షణ సమితి శిబిరం దగ్గరకు వెళుతున్న ఆడవాళ్ళను కొందరు అడ్డగించి దాడులు చేయటం సంచలనంగా మారింది. గురువారం ఉదయం మందడంలో జరుగుతున్న శిబిరం దగ్గరకు ఉద్దండరాయుని పాలెం గ్రామ మహిళలను మందడం గ్రామం దగ్గర కొందరు అడ్డుకున్నారు. ఆటోలో శిబిరం దగ్గరకు వెళుతున్న ఆడాళ్ళని ట్రాక్టర్లు అడ్డుపెట్టి కర్రలతో అటకాయించారు. శిబిరం దగ్గరకు వెళ్ళేందుకు వీల్లేదంటు అడ్డుకున్నారు. అయినా మహిళలు వినకపోవటంతో ఆటోల అద్దాలను బద్దలు కొట్టేశారు. ఆటోలపై తమ ట్రాక్టర్లను నడిపి భయపెట్టేందుకు ప్రయత్నించారు. దాంతో మందడం గ్రామ కేంద్రంలోనే మహిళలు, యువకులంతా నిరసనగా కూర్చోవటంతో పెద్ద వివాదం మొదలైంది. తమపై టీడీపీకి చెందిన నేతలే దాడులు చేయించినట్లుగా మహిళలు ఆరోపిస్తున్నారు.



 


ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే దాదాపు 300 రోజులుగా తాము ఉద్యమం చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవటం లేదనే మంట ఉద్యమకారుల్లో ఉంది. ఎన్నిరకాలుగా ఒత్తిడికి ప్రయత్నిస్తున్నా జగన్ వీళ్ళ గోలను పట్టించుకోవటం లేదు. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానులకు అనుకూలంగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పోటి ఆందోళనలు మొదలయ్యాయి. అమరావతికి అనుకూలంగా జరుగుతున్న ఆందోళనల్లో నిజమైన రైతులు, స్ధానికులకన్నా పెయిడ్ ఆర్టిస్టులే ఎక్కువగా ఉన్నట్లు వైసీపీ నేతలు ఎప్పటి నుండో ఆరోపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. దీనికి తగ్గట్లే అమరావతి రాజధాని పరిధిలోని 29 గ్రామాలకు ఆందోళనలు జరుగుతున్నది కూడా కేవలం ఆరేడు గ్రామాల్లోనే. ఈ ఆందోళనల్లో కూడా నెల్లూరు, అనంతపురం తదితర జిల్లాలకు చెందిన నేతల మద్దతుదారులు కనబడుతున్నారు. దాంతో స్ధానికులకన్నా ఆందోళనల్లో స్ధానికేతరులే ఎక్కువ అనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి.



 


ఇదే సందర్భంలో పోటీగా మొదలైన బహుజన పరిరక్షణ సమితి ఆందోళనల్లో చాలామంది స్ధానికులే ఉన్నారట. మూడు రాజధానులకు మద్దతుగానే కాకుండా రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ళపట్టాలు ఇవ్వాల్సిందే అంటూ డిమాండ్లు చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రాజధాని ప్రాంతంలోని మందడం గ్రామం శిబిరం దగ్గరకే స్ధానికులు రాకుండా టీడీపీ నేతలు అడ్డుకోవటం ఏమిటంటు బహుజన సమితి మహిళలు మండిపోతున్నారు. తమ పొరుగు గ్రామంలో జరుగుతున్న వికేంద్రీకరణ శిబిరానికి తమనే అడ్డుకోవటం ఏమిటంటే నిలదీస్తున్నారు. వీళ్ళ వాదం విన్నతర్వాత లాజిక్ కనిపిస్తోంది. అంటే తమ రాజధాని గ్రామాల్లో తమకు పోటీగా జరుగుతున్న ఆందోళనా శివిరంవైపు పొరుగువాళ్ళని కూడా కొందరు రానీయటం లేదనే విషయం తాజా గొడవతో బయటపడింది. ఇదే విషయాన్ని బహుజన శిబిరానికి చెందిన ఆందోళనకారులు అడుగుతున్నారు. తమనే తమ గ్రామాల్లో యధేచ్చగా తిరగనియ్యని అమరావతి మద్దతుదారులు ఒకవేళ రాజధాని నిర్మాణం జరిగుంటే అసలు తమ ఊర్లలో తమను ఉండనిచ్చుండేవారేనా ? అని మండిపడుతున్నారు.



 


మొత్తంమీద అమరావతి కేంద్రంగా అనుకూల, వ్యతిరేక ఉద్యమాలు ఊపందుకోవటంతో ఎప్పుడే గొడవ జరుగుతుందో అనే టెన్షన్ మొదలైపోయింది. నిజానికి అమరావతికి మద్దతుగా 300 రోజులుగా ఉద్యమం జరుగుతున్నదని చెబుతున్నారే కానీ జరుగుతున్న ఉద్యమం అంతా ఎల్లోమీడియాలోనే ఎక్కువగా కనబడుతోంది. ప్రతిరోజు ఏవో నాలుగు ఫొటోలు వేయటం రాష్ట్రవ్యాప్త ఉద్యమం అంటూ మొదటిపేజీల్లో కవరేజి ఇవ్వటం మామూలైపోయింది. ఎల్లోమీడియా గనుక అమరావతి ఉద్యమానికి మద్దతుగా వార్తలు, ఫొటోలు ప్రచురించకపోతే మూడో నాటికే ఉద్యమం అటకెక్కిపోతుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే అమరావతికి మద్దతుగా జరుగుతున్న ఆందోళనకు రాష్ట్రంలోని మరే ప్రాంతంలో కూడా స్పందన కనబడటం లేదన్నది వాస్తవం. మరి దాదాపు మూడు వారాల క్రితం మొదలైన మూడు రాజధానుల డిమాండ్ తో మొదలైన ఉద్యమం ఎన్నిరోజులు జరుగుతుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: