స్ధానిక సంస్ధల ఎన్నికలకు సంబంధించి స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఊహించని రీతిలో గట్టి షాక్ తగిలినట్లే ఉంది. ఇంతకాలం అధికార వైసీపీ వినిపించిన ప్రశ్నలు, అభ్యంతరాలనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా మొదలుపెట్టారు. రాజమండ్రి పార్టీ నేతలు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటికప్పుడు రాష్ట్రంలో స్ధానిక సంస్ధల ఎన్నికలను నిర్వహించకపోతే వచ్చే ఇబ్బంది ఏమిటంటూ గట్టిగానే నిలదీశారు. ఒకవైపు కరోనా వైరస్ తీవ్రత పెరుగుతున్న నేపధ్యంలో  స్ధానిక సంస్ధల ఎన్నికలు నిర్వహించాలన్న పంతం ఎందుకంటు నిమ్మగడ్డను సూటిగానే ప్రశ్నించారు. కరోనా వైరస్ కేసుల నేపధ్యంలో స్ధానిక సంస్ధల ఎన్నికలను నిర్వహించకపోతే వచ్చే నష్టం ఏమిటో చెప్పాలంటూ కమీషనర్ ను వీర్రాజు గట్టిగానే తగులుకున్నారు. ఎన్నికల నిర్వహణలో  ఎన్నికల కమీషనర్ చేస్తున్న కసరత్తుకు తాము వ్యతిరేకమంటూ గట్టిగానే చెప్పేశారు. బీజేపీ నుండి స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణపై ఇటువంటి ప్రశ్నలు, అభ్యంతరాలు  వస్తాయని బహుశా నిమ్మగడ్డ ఊహించుండరు.




ఎన్నికల నిర్వహణ పేరుతో నిమ్మగడ్డ ఆమధ్య ఊరుపేరు లేని చాలా పార్టీలను ఆహ్వానించారు. నిజానికి మార్చిలో వాయిదాపడిన ఎన్నికల్లో ఏ పార్టీలైతే పార్టిసిపేట్ చేశాయో వాటిని మాత్రమే పిలిస్తే సరిపోతుంది. కానీ నిమ్మగడ్డ మాత్రం వ్యూహాత్మకంగా 19 పార్టీలను సమావేశానికి పిలిచారు. వీటిలో ఎల్జేపీ, ఆర్జేడీ లాంటి అనేక పార్టీలున్నాయి. రాష్ట్రంలో ఇన్ని పార్టీలున్నాయని జనాలకు కూడా తెలీదంటే అతిశయోక్తి కాదు. ఇన్ని పార్టీలను ఎందుకు పిలిచారంటే ఎన్నికల నిర్వహణకు మెజారిటి పార్టీలు సుముఖంగా ఉన్నాయని  చెప్పుకునేందుకే అన్నది వాస్తవం. ఎన్నికలు నిర్వహించాల్సిందే అంటు టీడీపీ+సీపీఐ మాత్రమే చెప్పాయి. జనసేన ఎన్నికలను నిర్వహించమని చెప్పలేదు. అయితే ఎన్నికలు నిర్వహిస్తే తాము పాల్గొంటామని మాత్రమే చెప్పింది. ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకోమని సీపీఎం చెప్పింది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాతే ఎన్నికలు జరగాలని కాంగ్రెస్ చెప్పింది. అప్పుడు బీజేపీ ఏమి చెప్పిందో కానీ ఇపుడు మాత్రం ఎన్నికల నిర్వహణను పూర్తిగా వ్యతిరేకిస్తోంది.




19 పార్టీలను సమావేశానికి పిలిచినా అధికార వైసీపీతో పాటు మరో  ఆరు పార్టీలు హాజరుకాలేదు. సరే పార్టీల అభిప్రాయాలు ఎలాగున్నా నిమ్మగడ్డ మాత్రం ఎన్నికల నిర్వహణకే రెడీ అయిపోతున్నారు. చీఫ్ సెక్రటరీతో జరుగుతున్న లేఖల యుద్ధమే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. ప్రభుత్వ ఆలోచనలతో తనకేమీ సంబంధం లేదన్నట్లే నిమ్మగడ్డ వ్యవహరిస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది. ప్రభుత్వ సహకారం లేకుండా తనంతట తానుగా నిమ్మగడ్డ ఒక్క అడుగు కూడా వేయలేరు. అందుకనే ప్రతి విషయానికి కోర్టును అడ్డం పెట్టుకుంటున్నారు. కరోనా వైరస్ నేపధ్యంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని చెప్పిన ప్రభుత్వంపై తీవ్రంగా మండిపోతున్నారు. మరిపుడు వైసీపీతో పాటు ప్రతిపక్షం బీజేపీ అధ్యక్షుడు వీర్రాజు అడిగిన ప్రశ్నలకు నిమ్మగడ్డ ఏమని సమాధానం చెబుతారు ? రాష్ట్రంలో ఒక్క కేసున్నపుడే కరోనా వైరస్ పేరుతో ఎన్నికలు వాయిదా వేసిన నిమ్మగడ్డ తాజాగా రోజుకు 2 వేల కేసులు వెలుగు చూస్తున్న సమయంలో  స్ధానిక సంస్ధల ఎన్నికలను నిర్వహించాలని అనుకోవటం ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు. మరి ముందు ముందు నిమ్మగడ్డ ఏమి చేయబోతున్నారో చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: