దేశవ్యాప్తంగా మూడో కూటమికోసం ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మోదీని గద్దె దింపేందుకు వైరి వర్గాలన్నీ ఒక్కటవుతున్నాయి. సహజంగా వీటికి నేతృత్వం వహించాల్సింది కాంగ్రెస్సే అయినా, ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ లీడ్ తీసుకోవడం గమనార్హం. అవును, మమతా బెనర్జీ మూడో కూటమిలో కీలకం కాబోతున్నారు. అందుకే ఆమె తన మకాంని ఢిల్లీకి మార్చేయాలనుకుంటున్నారు.

ఓవైపు మూడో కూటమికి ప్రయత్నాలు జరుగుతుండగా, మరోవైపు బీజేపీలో గుబులు మొదలైంది. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పట్టు నిలుపుకోవడంతోపాటు, కొత్త రాష్ట్రాల్లో కూడా కాషాయ జెండా రెపరెపలాడించాల్సిన అవసరం ఉంది. ఇటీవల పలు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఆశించిన ఫలితాలు లభించలేదు. వచ్చ ఏడాది జరగాల్సిన ఎన్నికల్లో కూడా బీజేపీకి ఘన విజయాలు స్వాగతం పలుకుతాయనే అంచనాలు లేవు. దీంతో ప్రాంతీయ పార్టీలపై బీజేపీ పూర్తి స్థాయిలో దృష్టిపెట్టింది. దక్షిణాదిన బలంగా ఉన్న పార్టీలను కలుపుకొని పోవాలని ఆలోచిస్తోంది. ముఖ్యంగా ఏపీలో వైసీపీపై వారి దృష్టి పడింది.

ప్రస్తుతానికి వైసీపీ అన్ని పార్టీలకు సమదూరం పాటిస్తోంది. అందులోనూ కాంగ్రెస్ కేంద్రంగా జరిగే రాజకీయాలకు జగన్ మొదటినుంచీ దూరం. ఆ పార్టీనుంచి వేరుపడి సొంత కుంపటి పెట్టుకున్న జగన్, తిరిగి కాంగ్రెస్ కి సన్నిహితంగా ఉంటారని ఊహించలేం. ఇదే ఇప్పుడు బీజేపీకి ప్లస్ పాయింట్. తటస్థంగా ఉన్న జగన్ ని తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. 2024నాటికి పరిస్థితి దిగజారి, మిత్రపక్షాల మద్దతుతో మాత్రమే కేంద్రంలో అధికారం చేపట్టే పరిస్థితి వస్తే జగన్ లాంటి వారి సహాయం కాషాయదళానికి తప్పనిసరి. ఒకరకంగా బీజేపీలోని అభద్రతా భావమే ఆ పార్టీని ప్రాంతీయ పార్టీలకు దగ్గర చేస్తుందని చెప్పాలి. ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో కూడా మిత్ర పక్షాలకు బీజేపీ పెద్దపీట వేసింది. మరి జగన్ బీజేపీ సయోధ్యను కోరుకుంటారా..? వచ్చే ఎన్నికల వరకు వేచి చూస్తారా అనేది మాత్రం సస్పెన్స్. గతంలో కూడా వైసీపీ కేంద్ర కేబినెట్ లో చేరుతుందనే వార్తలొచ్చినా అవి వాస్తవరూపం దాల్చలేదు. ఈసారి మాత్రం వైసీపీలాంటి పార్టీల అవసరం బీజేపీకి ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: