ఏపీలో రాష్ట్ర వ్యాప్త పర్యటనకు పురంధేశ్వరి శ్రీకారం చుట్టారు. తిరుపతిలోని అలిపిరిని సందర్శించిన అనంతరం తిరుమలలోని పార్వేట మండపం తొలగించి, యథావిధిగా నిర్మిస్తామని ఇష్టానుసారంగా చేశారని విమర్శించారు. తాజాగా ఇప్పుడు తిరుపతిలోని అలిపిరి వద్ద ఉన్న మండపాన్ని తొలగిస్తామని అంటున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. 75 ఏళ్లు పూర్తయిన మండపాలను తొలగించాలంటే పురావస్తు శాఖ, పర్యవేక్షణ శాక అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని.. కానీ తిరుమలలో అలా జరగలేదని చెప్పారు.
అలిపిరి వద్ద ఉన్న మండపం 500 ఏళ్ల కంటే ఎక్కువే అయిందని తెలిపారు. అలిపిరిలో మండపాన్ని ఏం చేయాలన్నా.. టీటీడీ తప్పకుండా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా పర్యవేక్షణలోనే చేయాలని.. లేకుంటే బీజేపీ ప్రతిఘటిస్తుందని హెచ్చరించారు. మండపల మరమ్మతులు, తొలగింపు వంటి పనులు పురావస్తు ఆధ్వర్యంలోనే చేపట్టాలని డిమాండ్ చేశారు.
మరోవైపు టీటీడీ నిధులను తిరుపతి పురపాలికకు కేటాయించే విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గిందని.. అదే క్రమంలో మరో మార్గంలో టీటీడీ నిధులు పొందేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. చెత్తపన్ను, కరెంట్ ఛార్జీల మోత ఇలా ఎన్నో రకాలుగా వసూలు చేస్తున్న పన్నులతోనే తిరుపతిలో మౌలిక సౌకర్యాలు కల్పించాలన్నారు. టీటీడీ నిధులు సనాతన ధర్మం అభ్యున్నతికే ఖర్చు చేయాలన్నారు. కానీ ప్రభుత్వం ఇమామ్లకు, పాస్టర్లకు గౌరవ వేతనం ఇస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీ అర్చకులు ఉన్న ఆలయాలకు ధూప దీప నైవేద్యాలకు ఇస్తున్న సంభావనలను మాత్రం నిలిపివేసిందని ఆమె ఆరోపించారు. పురంధేశ్వరి లేవనెత్తిన ఈ అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి