వైసీపీ అసెంబ్లీ, లోక్‌సభ టికెట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తి చేసింది. రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల్లో 27 మంది సిటింగ్‌లకు వైఎస్‌ జగన్ టికెట్లు నిరాకరించారు. మరో 14 మంది ఎమ్మెల్యేలను వారి నియోజకవర్గాల నుంచి వేరే నియోజకవర్గాలకు మార్చారు. అయితే విచిత్రం ఏంటంటే... నా బీసీలు.. నా ఎస్సీలు.. నా ఎస్టీలు.. అని ప్రతి సభలోనూ చెప్పుకునే జగన్.. టికెట్‌ నిరాకరించిన సిట్టింగుల్లో మెజారిటీ బడుగు నేతలే ఉండటం విశేషం. టికెట్‌ మళ్లీ దక్కని 27 మందిలో 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే ఉన్నారు. అలాగే సీట్లు మార్చిన 14 మందిలోనూ 10 మంది ఎస్సీ, ఎస్టీలే ఉన్నారు.


అయితే పని తీరు ఆధారంగానే టికెట్లు ఉంటాయని చెప్పిన వైఎస్ జగన్.. అనేక ఆరోపణలు వినిపిస్తున్నా చాలా మందికి ఉదారంగా సీట్లు ఇచ్చేశారు. వీరిలో ఎక్కువగా  భూకబ్జాలు, అరాచకాలు, ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలు, సెటిల్‌మెంట్లు, రౌడీయిజం, కుంభకోణాల్లో ఆరితేరారని ఆరోపణలు ఎదుర్కొంటున్నవారే. చిత్తూరు జిల్లాలో ఓ సీనియర్ మంత్రి  సిఫార్సుతోనే జిల్లాలోని ఒక దళిత ఎమ్మెల్యేని బలిపశువును చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.


చిత్తూరు జిల్లాలోనే మరో మంత్రి భారీగా అవినీతికి పాల్పడ్డారని, చివరకు సొంత పార్టీ నేతల వద్ద కూడా డబ్బులు వసూలు చేశారంటూ వైసీపీ నేతలే ప్రెస్‌మీట్లు పెట్టారు. అయినా ఆ మంత్రికి మళ్లీ టికెట్‌ దక్కింది. ఇక చిలకలూరిపేట వైకాపా ఇన్‌ఛార్జి పదవి కోసం మంత్రి విడదల రజినికి రూ.6.5 కోట్లు ఇచ్చానని ఓ నేత బహిరంగంగానే ఆరోపించినా ఆమె సీటు మార్చారే తప్ప వేటు వేయలేదు. ఆమె ఇప్పుడు గుంటూరు పశ్చిమ నుంచి బరిలో ఉన్నారు.


అలాగే ఉమ్మడి పశ్చిమగోదావరిలో టీడీఆర్‌ బాండ్ల కుంభకోణానికి సూత్రధారిగా పేరుబడిన ఎమ్మెల్యేకి, ఆయన కొడుక్కు కూడా జగన్ టికెట్లు ఇచ్చేశారు. ఇలాంటి ఉదాహరణలను ప్రస్తావిస్తున్న బడుగు నేతలు తమపైనే వేటు వేయడం అన్యాయం అంటున్నారు. మరి జగన్ వ్యూహం ఎంత వరకూ ఫలిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: