గత రెండు లోక్ సభ ఎన్నికల్లో సొంతంగా బెంచ్ మార్క్ 272ను దాటిన బీజేపీ.. ఈ సారి ఎన్నికల్లో మాత్రం ఆ మార్కును అందుకోలేకపోయింది. 2014లో 282 సీట్లు, 2019లో రికార్డు స్థాయిలో 303 సీట్లు గెలుచుకోగా.. 2024లో మాత్రం 240 సీట్లకే పరిమితమైంది. గత ఎన్నికలతో పోల్చితే 53 మంది ఎంపీలను కోల్పోయింది.


లోక్ సభ ఎన్నికలు ప్రారంభం అయ్యాక 400 సీట్లే లక్ష్యం అంటూ ప్రచారం చేసిన  కాషాయ నేతలు.. కనీసం 250 మార్కును కూడా అందుకోలేకపోవడంపై రాజకీయ పండితులు అనేక విశ్లేషణలు చేస్తున్నారు. 2014, 19 ఎన్నికల్లో బీజేపీ మోదీ కరిష్మాతోనే విజయం సాధించింది. అయితే ఈ సారి కూడా అదే ఆయుధంతో పాటు హిందూత్వ, అయోధ్య రామాలయ అంశాన్ని బలంగా తీసుకెళ్లింది. వాస్తవానికి అయోధ్యలో రామ మందిర అంశం తమను గట్టెక్కిస్తుంది ఆ పార్టీ నేతలు బలంగా నమ్మారు.


కానీ ఫలితాలు చూస్తే కొన్ని చోట్ల ఈ మంత్రం పనిచేసినా.. మెజార్టీ ప్రజలు హిందుత్వ ఎజెండాపై పెదవి విరిచారు. లోక్ సభ ఫలితాలను విశ్లేషిస్తే పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బీజేపీకి ఆయువు పట్టు అయిన పలు రాష్ట్రాల్లో సీట్లు గణనీయంగా తగ్గడం ఆ పార్టీపై తీవ్ర ప్రభావం చూపింది.


అందులో ముఖ్యంగా యూపీ, పశ్చిమ బెంగాల్, గుజరాత్, రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట్ర, హరియాణాతో పాటు పంజాబ్ లో అయితే ఏకంగా ఆ పార్టీ ఖాతానే తెరవలేదు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ గణనీయంగా సీట్లు కోల్పోయింది.  కేవలం సీట్లే కాదు ఓట్లు శాతం కూడా భారీగానే పడిపోయింది. 139 స్థానాల్లో ఆ పార్టీకి గతంతో పోల్చితే 70శాతానికి పైగా మెజార్టీ తగ్గడం గమనార్హం. ఇందులో మోదీ కూడా ఉండటం కొసమెరుపు. ప్రధానికి గత ఎన్నికల్లో వారణాసిలో 4.5లక్షల మెజార్టీ వస్తే అది ఈ సారి 1.5లక్షలకే పరిమితం అయింది. ఏది ఏమైనా ఈ ఫలితాలు బీజేపీకి మేల్కొలుపు అని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: