ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన మరియు మండలాల సరిహద్దుల మార్పు అనే అంశం పెద్ద ఎత్తున తెరపైకి వచ్చింది. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలోని కమిటీ ఈ విషయంలో కసరత్తు ప్రారంభించినా ప్రస్తుతం ఈ ప్రక్రియ ఒక విధమైన స్తబ్దతకు లోనైనట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో సరిహద్దుల మార్పుకు గడువు చాలా తక్కువగా ఉంది. కుల గణన వచ్చే ఫిబ్రవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా కుల గణన ప్రారంభం కానుంది. కేంద్ర నిబంధనల ప్రకారం, ఏదైనా గణన లేదా సర్వే ప్రారంభానికి ముందు జిల్లాల, మండలాల సరిహద్దులను ఫ్రీజ్‌ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో డిసెంబర్ 29 నాటికి సరిహద్దుల మార్పు ప్రక్రియ పూర్తి కావాలి. ఆ తర్వాత మార్పులు చేయడం సాంకేతికంగా సాధ్యం కాదు.


మదనపల్లె, మార్కాపురం జిల్లాల పరిస్థితి :
కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీలు వచ్చాయి. ప్రకాశం జిల్లాను విడదీసి మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేయాలనే డిమాండ్‌పై ప్రభుత్వం సానుకూలంగా ఉంది. దీనికి పెద్దగా రాజకీయ అడ్డంకులు లేవు. మదనపల్లె: చిత్తూరు/అన్నమయ్య జిల్లాల పరిధిలోని మదనపల్లెను ప్రత్యేక జిల్లాగా చేయాలనేది దశాబ్దాల డిమాండ్. దీనిపై కూడా కమిటీ సానుకూల నివేదిక ఇచ్చినట్లు సమాచారం.
పార్వతీపురం మన్యం: ఈ జిల్లాను విడదీసి మరో కొత్త జిల్లాను ఏర్పాటు చేసే అంశంపై కూడా చర్చలు జరిగాయి, కానీ తుది నిర్ణయం ఇంకా వెలువడలేదు.

 
జిల్లాల విభజన ప్రక్రియ నెమ్మదించడానికి ప్రధాన కారణాలు ఏంటంటే .. సొంత పార్టీ నేతల అభ్యంతరాలు ఉన్నాయి. నెల్లూరు, తిరుపతీ జిల్లాల సరిహద్దుల మార్పుపై సొంత పార్టీ నేతలే వ్యతిరేకత వ్యక్తం చేశారు. కొన్ని గ్రామాలను ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు మార్చడం వల్ల రాజకీయంగా నష్టం జరుగుతుందని వారు భావిస్తున్నారు.
శ్రీకాకుళంలోని కొన్ని మండలాలను ఇతర జిల్లాల్లో కలపడంపై స్థానికంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. అధికారులు తమ నివేదికలను సిద్ధం చేసి  ముఖ్యమంత్రి కార్యాలయం కి పంపినట్లు చెబుతున్నారు. అయితే, కుల గణన మరియు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ సమయంలో ఇన్ని మార్పులు అవసరమా? అనే సందిగ్ధంలో సీఎం చంద్రబాబు ఉన్నట్లు సమాచారం.


ప్రభుత్వం మౌనంగా ఉండటాన్ని బట్టి చూస్తే, ఈ ఏడాదికి కేవలం మార్కాపురం, మదనపల్లె వంటి అత్యంత అవసరమైన మార్పులకే పరిమితం కావచ్చు లేదా పూర్తి ప్రక్రియను కుల గణన తర్వాతకు వాయిదా వేయవచ్చు. ఒకవేళ డిసెంబర్ 29 లోపు గెజిట్ నోటిఫికేషన్ రాకపోతే, వచ్చే ఏడాది చివరి వరకు జిల్లాల మార్పు అంశం మళ్ళీ తెరపైకి రావడం కష్టమే. ప్రభుత్వం నుంచి రాబోయే రెండు మూడు రోజుల్లో ఏదైనా అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: