తెలంగాణ రాష్ట్రంలో  కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. నిన్నా మొన్న‌టి వ‌ర‌కు ఎక్కువ‌గా జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే కేసులు ఎక్కువ‌గా న‌మోదు వ‌చ్చినా శ‌నివారం వెల్ల‌డైన ఫ‌లితాల్లో ప‌లు జిల్లాల నుంచి గ‌రిష్ట సంఖ్య‌లోనే కొత్త కేసులు ఉండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. శ‌నివారం ఒక్క జ‌న‌గామ జిల్లాలోనే 10 కేసులు న‌మోద‌వ‌డం గ‌మ‌నార్హం. అలాగే రంగారెడ్డి 50కి పైగా కేసులు న‌మోద‌య్యాయి. తెలంగాణ‌లో మొత్తం  గడిచిన 24 గంటల్లో 546 కొత్త కేసులు నమోదయ్యాయి.  దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య   7702కి చేరింది. కరోనాతో ఇవాళ ఐదుగురు మరణించారు.  దీంతో మొత్తం మరణాల సంఖ్య 203కి చేరింది.  

 

నమోదైన మొత్తం కేసుల్లో 3363కేసులు యాక్టివ్ గా ఉంటె, 3506 మంది ట్రీట్మెంట్ తీసుకొని డిశ్చార్జ్ అయ్యారు.  ఈరోజు నమోదైన 546 కరోనా కేసుల్లో జీహెచ్ఎంసి పరిధిలోనే 458 కేసులు ఉన్నాయి.  రంగారెడ్డిలో 50, మేడ్చల్ లో 6, మెహబూబ్ నగర్  3, వరంగల్ అర్బన్  1, వరంగల్ రూరల్ 2, జనగాం 10, ఖమ్మం 2, కరీంనగర్ 13, ఆదిలాబాద్ 1కేసు నమోదైంది. ఇదిలా ఉండ‌గా మ‌రో వారం రోజుల్లో రాష్ట్రంలో క‌రోనా ఉగ్ర‌రూపం దాల్చుతుంద‌ని వైద్య‌వ‌ర్గాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. ముంబై, ఢిల్లీ, గుజ‌రాత్‌, త‌మిళ‌నాడు వంటి రాష్ట్రాల్లో క్ర‌మంగా కేసులు పెరుగుతూ వెళ్లి ఇప్పుడు అద‌పు చేయ‌డం క‌ష్ట‌త‌ర‌మైన ప‌రిస్థితికి చేరుకున్నాయి. ఇప్పుడు తెలంగాణ‌లోనూ అదే ప‌రిస్థితి నెల‌నొనే ప్ర‌మాదం స్ప‌ష్టంగా క‌న‌బ‌డుతోంద‌ని చెబుతున్నారు.


అలాగే ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది.  కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఒంగోలు, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల్లో  తిరిగి లాక్ డౌన్ విధించేందుకు ప్రభుత్వం సిద్దమైన సంగతి తెలిసిందే.  ఆదివారం నుంచి 14 రోజులపాటు లాక్ డౌన్ విధిస్తున్నారు.  కరోనా కేసులు చిత్తూరు జిల్లాలోనూ భారీగా  పెరుగుతున్నాయి.  తిరుపతిలోనూ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.  రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. ఒక రోజు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుంటే.. మరొక రోజు తగ్గుతూ ఉన్నాయి. ఇక దేశ వ్యాప్తంగా రోజుకీ వేల సంఖ్యలో కేసులు నమోదవుతుండటం కలకలం రేపుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: