కొత్త ఆలోచనలు, ఆసక్తి, కుతుహలం ఇలాంటి లక్షణాలన్ని చిన్నారుల్లో అధికంగా ఉంటాయి. వారికంటూ ఒక ప్రత్యేక ప్రపంచం ఉంటే ఇవి మరింత ఎక్కువగా ఉంటాయి. వారిలో సృజనాత్మక శక్తి ఊపిరి పోసుకుంటుంది. ఈ విషయాన్ని గ్రహించడం వల్లనే తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంట్లోనూ వారికంటూ ఓ ప్రత్యేక ప్రపంచం ఉండాలని భావిస్తున్నారు. పిల్లల కోసం స్పెషల్‌ రూమ్‌లు ఈ భావనతోనే ఆవిర్భవించాయి. కాన్సెప్ట్‌ బాగానే ఉంది.. కానీ ఇంతకూ ఆ రూమ్‌ ఎలా ఉండాలి? ఏవేవి బొమ్మలు ఉండాలి? కలర్స్ ఎలా ఉండాలి అనే దాని గురించి చూద్దాం.

 


పిల్లల రూమ్‌ ఇలాగే ఉండాలంటూ  ఏమిలేవు. వారి ఆసక్తులు, అభిరుచులు, వయస్సు, లింగ భేదం గదిని రూపొందించేటప్పుడు  దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు. దీనికితోడూ పిల్లల ఆరోగ్యం, చదువు, ప్రవర్తనలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.  అయితే క్షణానికో కొత్త ఇంటీరియర్‌ పుట్టుకొస్తున్న తరుణంలో అన్ని హంగులు అమర్చుకోవాలంటే కొంచెం ఖర్చుతో కూడిన వ్యవహరమే. ఇక ఒక క్రమ పద్ధతంటూ లేకుండా రూమ్‌లోని ఫర్నిచర్‌ను తీర్చిదిద్దడం పిల్లలను ఆకర్షిస్తుంది. అలా అని చిందరవందరగా చేయవద్దు. 
పిల్లలను ఆకట్టుకొనేలా గదిని రూపొందించడంలో రంగులకు కావాల్సినంత ప్రాధాన్యత ఉంది. మానసిక శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం చిన్న పిల్లలు ఎరుపు, నీలం, పసుపు రంగులను ఇష్టపడతారు.

 

 

 

ఇవి కాకుండా ఆకుపచ్చ, పర్పుల్‌లు కూడా ఓకే. ఇక వయోలెట్, పింక్‌లు కూడా పర్వాలేదు. అన్నింటికన్నా ముఖ్యం మీ చిన్నారి ఏ రంగుని ఇష్టపడుతున్నాడు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మొత్తం అంతా ఒకే రంగు కాకుండా గదిలో వేర్వేరు  చోట్ల వేర్వేరు రంగులను నింపడం ద్వారా అందాన్ని తేవచ్చు. దీనితో పాటు ఒక్కో రంగు ఒక్కో అంశాన్ని బహిర్గత పరచడానికి ప్రేరణ కల్పిస్తుందని కలర్‌ సైకాలజీ చెబుతోంది. ఎరుపు అధికంగా ప్రభావితం చేసే రంగు, ఇక ఆరెంజ్‌ స్నేహ స్వభావాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఆడుకునే చోట, పిల్లలు కూర్చునే చోట ఈ కలర్‌ ఉంటే బాగుంటుంది. పసుపు ఏకాగ్రతను పెంచేందుకు తోడ్పడుతుంది. అందువల్ల చదువుకునే చోట వేస్తేసరి. పిల్లల కంటూ ప్రత్యేకించి గది చిన్నదైతే బాగా దట్టంగా వేయడం వల్ల మరింత చిన్నదిగా కనిపించే ప్రమాదముంది. కాబటి తేలిక రంగులు వేస్తే మంచిది. పిల్లలకు ఇష్టమైన కార్టూన్‌ క్యారెక్టర్లను గోడలపై చిత్రించడం ద్వారా వారికి ఆనందాన్ని కలుగచేయవచ్చు.

 

లైట్ల విషయానికి వస్తే బాగా వెలుతురుని అందించే ఫ్లోరోసెంట్‌ బల్బులను వాడాలి. లైటింగ్‌ స్టాండ్లు కూడా వంకీలు లేదా ఇతర డిజైన్లతో ఉంటే పిల్లలను ఆకట్టుకుంటాయి. అయితే కంటిపై ఎలాంటి ప్రభావం చూపకుండానూ, చదువుకొనేటప్పుడు ఇబ్బంది కలగకుండానూ ఉండాలి. పిల్లల గది కదా అని తెగ హంగామా చేసి అన్ని వస్తువులను పేర్చేయకుండా అవసరమైన మేరకు ఉంచాలి. ఈ క్రమంలో వారి అభిరుచులకు ప్రాధాన్యతను ఇస్తూనే ఆకట్టుకొనే విధంగాను రూపొందించాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: