బతుకమ్మ పండుగ తెలంగాణా రాష్ట్రములోని ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ (గౌరి) పండుగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది. నేడు సెప్టెంబర్ 28 న మొదటి బతుకమ్మ సంబరం మొదలయ్యింది.. రంగు రంగుల పూలతో త్రికోణాకారంలో పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ పాడే బతుకమ్మ పాటలు పాడతారు. బొడ్డెమ్మతో మొదలు ఎంగిలిపుప్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ.. ఇలా దేని ప్రత్యేకత దానిదే.. తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను బావిలో లేదా నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు.. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం, చరిత్ర, పురాణాలు మేళవిస్తారు.

సెప్టెంబరు, అక్టోబరు నెలలు తెలంగాణ ప్రజలకు పండుగల నెలలు. ఈ నెలలలో రెండు పెద్ద పండుగలు జరపబడతాయి. తొమ్మిదిరోజులు సమర్పించే నైవేద్యాలలో మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసర్లు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, కాజు, బెల్లం, పాలు ఉపయోగిస్తారు. ఈ పండుగలకు కనీసం పదిహేను రోజులు అటువైపు, ఇటువైపు అంతా పండుగ సంబరాలు, కుటుంబ కోలాహలాలు, కలయకలుతో నిండిపోయుంటుంది. ఈ పండుగ వర్షాకాలపు చివరిలో, శీతాకాలపు తొలి రోజులలో వస్తుంది. అప్పటికే వర్షాలతో చెరువులన్నీ మంచి నీటితో నిండి ఉంటాయి. రకరకాల పువ్వులు రంగు రంగులలో ఆరుబయలలో పూసి ఉంటాయి. వీటిలో గునుగు పూలు, తంగేడు పూలు బాగా ఎక్కువగా పూస్తాయి. బంతి, చేమంతి, నంది వర్ధనం లాంటి పూలకు కూడా ఇదే సమయం. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాత్ర ఎంతో విశిష్టమైంది.

తెలంగాణ ఉద్యమ సందర్భాల్లో బతుకమ్మతో ఊరేగింపులు చేసిన తెలంగాణ ప్రజలు తమ తమ అస్తిత్వాన్ని సగర్వంగా ప్రకటించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరుణంలో బతుకమ్మ పండుగకు ప్రాధాన్యత మరింతగా పెరిగిపోయింది. 9రోజులపాటు ప్రతిరోజూ ఓ రకమైన నైవేద్యం సమర్పిస్తారు. మొదటి ఎనిమిది రోజులు ఈ నైవేద్యం తయారీలో యువకులు, యువతులు పాల్గొంటారు. చివరిరోజు సద్దుల బతుకమ్మ అంటారు. ఈరోజు మాత్రం నైవేద్యాన్ని మహిళలు తయారు చేస్తారు.  చివరి రోజు సాయంత్రం, ఆడపడుచులు అందరూ చక్కగా దుస్తులు, అభరణాలు ధరించి బతుకమ్మను వాకిలిలో పెడతారు. చుట్టుపక్కల ఉన్న వారు కూడా వారి బతుకమ్మలను ఇదే విధంగా అమర్చి వాటి చుట్టూ పెద్ద వలయాకారంలో చేరుతారు. తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండుగ ఎంతో ఆనందోత్సాహలతో జరుపుకుంటారు. ప్రస్తుతం బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణలో  వ్యాప్తంగా ఎన్నో ప్రైవేట్ ఆల్బామ్స్ కూడా వస్తున్నాయి..మంచి ఆదరణ పొందుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: