ఏపీ రాజకీయాల్లో మంచి వాక్చాతుర్యం కలిగి, లేనిపోని విమర్శలు చేయకుండా, సబ్జెక్ట్ పరంగా మాట్లాడుతూ ప్రత్యర్ధులకు చెక్ పెట్టగలిగే నేతల్లో పయ్యావుల కేశవ్ కూడా ఒకరు. టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ఈ అనంతపురం నేత...1994 ఎన్నికల్లో ఎన్టీఆర్ అండతో ఉరవకొండ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచి మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యేగా సక్సెస్ కావడంతో రెండోసారి కూడా టిక్కెట్ దక్కించుకుని 1999 ఎన్నికల్లో పోటీ చేసి అనూహ్యంగా ఓటమి పాలయ్యారు.

 

ఇక 2004,2009 ఎన్నికల్లో రాష్ట్రమంతా వైఎస్ గాలి బలంగా ఉన్నా సరే కేశవ్ ఉరవకొండ నుంచి వరుసగా గెలిచారు. అయితే ప్రతిపక్ష ఎమ్మెల్యేగా కేశవ్ అద్భుతమైన పాత్ర పోషించారు. అలాగే పి‌ఏ‌సి ఛైర్మన్‌గా ఉంటూ...వైఎస్ ప్రభుత్వానికి చుక్కలు చూపించారు. ప్రతి లెక్కలో బొక్కలు పట్టుకుంటూ, ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టారు. తన వాక్చాతుర్యంతో ప్రత్యర్ధి పార్టీని సైతం ఆకట్టుకున్నారు. ఒకానొక సమయంలో వైఎస్సార్ కూడా...పయ్యావులని కాంగ్రెస్ లోకి తీసుకోచ్చేందుకు ప్రయత్నించారు. కానీ పయ్యావుల రాజకీయంగా నిలబెట్టిన టీడీపీని వీడలేదు.

 

2014 ఎన్నికలోచ్చేసరికి పయ్యావులకు ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చినా..పయ్యావుల మాత్రం ఉరవకొండలో వైసీపీ అభ్యర్ధి విశ్వేశ్వర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే సీనియర్ నేత కావడంతో చంద్రబాబు..పయ్యావులకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. కానీ మంత్రి పదవి ఇవ్వలేదు. అయితే 2019 ఎన్నికలకొచ్చేసరికి పరిస్తితి మారిపోయింది. రాష్ట్రమంతా టీడీపీ ఘోరంగా ఓడిపోతే పయ్యావుల మాత్రం ఉరవకొండ నుంచి నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.

 

అయితే ప్రతిపక్షంలోకి వచ్చాక పయ్యావుల మునుపటిలా లేరు. అసలు పార్టీలో పెద్దగా యాక్టివ్ గా కనిపించడం లేదు. పి‌ఏ‌సి ఛైర్మన్ పదవి ఉన్నా సరే జగన్ ప్రభుత్వంపై దూకుడుగా వెళ్ళడం లేదు. ఓ వైపు అధినేత వైసీపీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నా సరే పయ్యావుల నోరు మెదపడం లేదు. అటు నియోజకవర్గంలో కూడా పెద్దగా ఎఫెక్టివ్ గా ఏమి పనిచేయడం లేదు. ఏదో అప్పుడప్పుడు నియోజకవర్గంలో సమస్యలపై మాత్రం గళం విప్పుతున్నారు.

 

ఇటు అసెంబ్లీలో కూడా మునుపటి వాడి ప్రదర్శించడం లేదు. ఏదో ఒకసారి అమరావతి భూముల విషయంలో తనపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మాత్రం గట్టిగా మాట్లాడారు. ప్రస్తుతానికైతే పయ్యావులలో పవర్ తగ్గినట్లే కనిపిస్తోంది.  ఇక ఉరవకొండ వైసీపీకి ఇన్‌చార్జ్‌గా ఉన్న విశ్వేశ్వర్ రెడ్డి ప్రజల్లో ఉంటూ పనులు చేస్తున్నారు. ఎలాగో వైసీపీ అధికారంలోకి ఉంది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీకే ఎక్కువ స్థానాలు వస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: