నెల్లూరు జిల్లాలో వైసీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో సూళ్ళూరుపేట కూడా ఒకటి. గత రెండు పర్యాయాలు నుంచి ఇక్కడ వైసీపీదే గెలుపు. వైసీపీ తరుపున కిలివేటి సంజీవయ్య గెలుస్తున్నారు. ఇక సంజీవయ్య మామ పసల పెంచలయ్య 1989లో కాంగ్రెస్ తరుపున సూళ్ళూరుపేటలో ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక తన మామ వెనుక రాజకీయం నేర్చుకున్న సంజీవయ్య 2013లో వైసీపీలోకి వచ్చారు.


ఇక 2014లో వైసీపీ తరుపున పోటీ చేసి, అప్పటివరకు టీడీపీ తరుపున మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పరసా వెంకట రత్నయ్యని ఓడించి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2019 ఎన్నికలోచ్చేసరికి మరోసారి సంజీవయ్య సత్తా చాటారు. ఈసారి పేటలో టీడీపీ చేతులెత్తేయడంతో సంజీవయ్య దాదాపు 73 వేల ఓట్ల మెజారిటీతో గెలిచి సత్తా చాటారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన సంజీవయ్య మరీ దూకుడుగా ఏమి పనిచేయడం లేదు.


కాకపోతే ప్రజలకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటున్నారు. అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందేలా చేస్తున్నారు. అటు నియోజకవర్గంలో కొత్తగా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు జరిగాయి. అయితే నియోజకవర్గంలో పలు సమస్యలు ఉన్నాయి. కొన్ని ఊర్లలో తాగునీటి సమస్య పూర్తిగా తగ్గలేదు. అలాగే నాయుడుపేట, సూళ్ళూరుపేట మున్సిపాలిటీల్లో అభివృద్ధి అంతంత మాత్రమే జరుగుతుంది. ఇటీవల మున్సిపాలిటీ ఎన్నికల్లో నాయుడుపేట, సూళ్ళూరుపేటలో వైసీపీనే గెలిచింది.


ఇక పేటలో టీడీపీ తరుపున పరసా వెంకట రత్నయ్య పనిచేస్తున్నారు. ఈయన గతంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు వయసు మీద పడటంతో పెద్దగా యాక్టివ్‌గా ఉండటం లేదు. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరుపున టిక్కెట్ దక్కించుకోవాలని నెలవల సుబ్రహ్మణ్యం చూస్తున్నారు. దీంతో పేట టీడీపీలో ఆధిపత్య పోరు పెరిగిందే. ఇదే వైసీపీ ఎమ్మెల్యేకు అడ్వాంటేజ్ అవుతుంది. ఎమ్మెల్యేకు ప్రభుత్వ పథకాలు బాగా ప్లస్ అవుతున్నాయి. అందుకే ఎమ్మెల్యే స్ట్రాంగ్‌గా లేకపోయిన సరే టీడీపీ వీక్‌గా ఉండటం వల్ల సూళ్ళూరుపేటలో వైసీపీకి ఎలాంటి ఇబ్బంది లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: