ఒకప్పుడు హీరో రాజశేఖర్ అంటే క్రేజ్ మామూలుగా ఉండేది కాదు. ఫ్యామిలీ, లవ్, యాక్షన్ సినిమాలకు కేరాఫ్‌గా నిలిచేవారు. తెలుగు ఇండస్ట్రీలో డిఫరెంట్ స్టోరీలతో పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఎంతగానో అలరించేవారు. అయితే సినీ ఇండస్ట్రీకి దూరమైన రాజశేఖర్ ‘గరుడవేగ, కల్కి’ సినిమాలతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. ఈ సినిమాలు మంచి సక్సెస్‌ను అందుకున్నాయి. తాజాగా రాజశేఖర్ నటిస్తున్న 91వ చిత్రం ‘శేఖర్’. దీనికి ‘మ్యాన్ విత్ ద స్కార్’ అనే పవర్‌ఫుల్ ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు.

ఈ సినిమాకు జీవిత రాజశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బీరం సుధాకర్ రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, శివానీ రాజశేఖర్, బొగ్గారం వెంకట శ్రీనివాస్ నటిస్తుండగా.. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల సినిమా టీజర్ కూడా విడుదలైంది. అరకు ప్రాంతంలోని తోట బంగ్లాలో వృద్ధ దంపతులు దారుణహత్యకు గురయ్యారనే వాయిస్ ఓవర్‌తో టీజర్ ఇంట్రెస్టింగ్‌గా స్టార్ అవుతుంది. ఇందులో రాజశేఖర్ పవర్‌ఫుల్ క్యారెక్టర్‌తో, కొత్త లుక్‌లో కనిపించనున్నారు. అయితే ఈ సినిమాలో రాజశేఖర్ పెద్ద కూతురు శివానీ కీలక పాత్రలో కనిపించనుంది.

వెండితెరపై తండ్రి కూతురు కలిసి నటిస్తున్న మొదటి చిత్రమిది. వీరిద్దరికి సంబంధించిన ఫోటోస్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ ఫోటోలో రాజశేఖర్, శివానీ సింప్లి సూపర్బ్ గా కనిపిస్తున్నారు. అయితే వీరిద్దరి మధ్య జరిగే సన్నివేశాలు, నటనపై జీవితా రాజశేఖర్ పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజశేఖర్, శివానీల మధ్య ఉన్న సన్నివేశాలు ‘శేఖర్’ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు. వాస్తవానికి ఇంట్లో ఎలా ఉంటారో.. సినిమాలో కూడా అలాగే కలిసి నటించారు. ఇద్దరు సహజ నటులే. వీరిద్దరినీ ఒకే సినిమాలో చూడటం ఎంతో సంతోషంగా ఉంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత.. త్వరలో సినిమా రిలీజ్ డేట్‌ను వెల్లడిస్తామని ఆమె పేర్కొన్నారు. కాగా, ఈ సినిమాలో ఆత్మీయ రాజన్, కన్నడ కిషోర్, సమీర్, ముస్కాన్, భరణి, రవివర్మ తదితరులు నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: