కాలం మారుతోంది. అదే సమయంలో మనుషుల జీవన విధానం కూడా మారుతోంది. మనుషుల ఆలోచనల్లో, ప్రవర్తనలో అనేక మార్పులు వస్తున్నాయి. మనుషుల్లో స్వార్థం అంతకంతకూ పెరుగుతోంది. కొన్ని సంవత్సరాల క్రితం మనుషుల మధ్య డబ్బు కంటే బంధాలే కీలక పాత్ర పోషించేవి. గతంలో మన చుట్టూ ఉన్న వాళ్లలో ఎవరికైనా సమస్య వస్తే అందరూ కలిసి ఆ సమస్య పరిష్కారం కోసం తమ వంతుగా సహాయం చేసేవారు. 
 
మనం, మనది అనే భావనతో మనుషులు మెలిగేవారు. ధనం కేవలం బ్రతకడం కోసమే అని భావించేవారు. కానీ మారుతున్న కాలంతో పాటే మనుషులు మారుతూ బంధాల కంటే డబ్బుకే ఎక్కువ విలువ ఇస్తున్నారు. డబ్బు ఉంటే జీవితంలో అన్నీ ఉన్నట్లేననే భావనలో బ్రతుకుతున్నారు. ఎవరికైనా ఆర్థికంగా సమస్యలు వస్తే ఆదుకోవడానికి కూడా చాలామంది సంకోచిస్తున్నారు. డబ్బు ఉన్నా లేవని అబద్ధాలు ఆడుతున్నారు. 
 
ఆస్తుల విషయంలో సొంత కుటుంబ సభ్యులనే మోసం చేస్తున్న ఘటనలు కోకొల్లలు. మరికొంతమంది ఎవరైనా డబ్బులు అడుగుతారని ముందే తెలిస్తే వాళ్లకు ఎదురుపడకుండా తప్పించుకుంటూ ఉంటారు. ప్రస్తుత కాలంలో అందరికీ డబ్బు సంపాదనే ప్రధాన ధ్యేయంగా మారింది. సమాజం ఎటుపోతే మనకు ఏంటి ఆలోచన ఇప్పుడు ఎవరికీ లేదు. డబ్బు వల్ల మనల్ని నమ్మిన వాళ్లను కూడా మోసం చేస్తున్నాం. 
 
చివరకు మన ప్రాణ స్నేహితుడు, తల్లి, తండ్రి, అక్క, అన్న, చెల్లి ఎవరైనా అవసరం అని డబ్బు అడిగితే కూడా లేవని చెబుతున్న పరిస్థితి నెలకొంది. ఆ డబ్బులు మన సొంత పనుల కోసం వినియోగించుకుంటే సరిపోతుంది కదా...? ఈ విధంగా డబ్బు మనల్ని రోజురోజుకు దిగజారుస్తోంది. జీవితంలో డబ్బు కంటే బంధాలే ముఖ్యం. ఎంత డబ్బు ఉన్నా బంధాలను నిలుపుకోలేకపోతే ఆ వ్యక్తి జీవితం వృథానే.        

మరింత సమాచారం తెలుసుకోండి: