ఏపీలో గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థపై సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీయే ప్రశంసల జల్లు కురిపించిన వేళ.. దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా ఈ వ్యవస్థపై ఆసక్తి చూపిస్తున్నాయి. తాజాగా అసోం రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా తమ రాష్ట్రంలో ఈ వ్యవస్థను అమలులోకి తెచ్చే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ఏపీలో గ్రామాలు, వార్డుల్లో ఏర్పాటు చేసిన సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థతో ప్రజలకు మంచి సేవలు అందుబాటులోకి వచ్చాయని అన్నారాయన. దేశవ్యాప్తంగా ఏపీ సీఎం జగన్ ఆలోచనను అందరూ ప్రశంసిస్తున్నారని చెప్పారు.
అసోం రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీ షేక్‌ ఆరిజ్ ‌అహ్మద్ తన స్వస్థలం ప్రకాశం జిల్లా పొదిలికి వచ్చారు. ఈ సందర్భంగా పొదిలి పట్టణంలోని వాలంటీర్లు, సచివాలయానికి సంబంధించిన సిబ్బందితో ఆయన ముఖాముఖి సమావేశమయ్యారు. పంచాయతీ డీఈ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఆయన పలు విషయాలపై మాట్లాడారు. వాలంటీర్ల విధులు, సచివాలయ సిబ్బంది విధులను నేరుగా అడిగి తెలుసుకున్నారు.

వ్యవసాయశాఖ, విద్య, వైద్య రంగాలకు సంబంధించి సచివాలయాల్లో ఎటువంటి సేవలు అందిస్తున్నారని ఆరా తీశారు. వాలంటీర్ల అర్హతలు, ఎంపిక విధానం గురించి కూడా వాకబు చేశారు. సచివాలయ ఉద్యోగులైన వెల్ఫేర్‌ అసిస్టెంట్లు, మహిళా పోలీసుల విధులు, నిర్వహణ తీరును క్షుణ్ణంగా దగ్గరుండి పరిశీలించారు. తమ రాష్ట్రంలో కూడా ఇలాంటి మంచి పథకాన్ని ప్రవేశ పెట్టాలనుకుంటున్నామని, తాను తిరిగి వెళ్లిన తర్వాత ప్రభుత్వానికి వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ పనితీరును గురించి సవివరంగా రిపోర్ట్‌ అందజేస్తానని చెప్పారు. అసోంతోపాటు మరికొన్ని రాష్ట్రాలు కూడా సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. వారంతా తమ ప్రభుత్వం తరపున అధికారులను ఈ వ్యవస్థపై అధ్యయనం చేసేందుకు పంపిస్తామని ఏపీ ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారు. పొరుగు రాష్ట్రం తెలంగాణ కూడా సచివాలయ వ్యవస్థకు సమానంగా మరో వ్యవస్థనుతీసుకు రావాలని ఆలోచిస్తోంది. అటు తమిళనాడు, కర్నాటక ప్రభుత్వాలు కూడా సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థను ప్రశంసించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: