ఒకానొక దశలో సునీల్‌ హీరోగా నటించిన చిత్రాలేవీ హిట్ కాకపోవడంతో.. ఆఫర్స్‌ కూడా తగ్గాయి. అదే కమెడియన్‌గా ఉంటే.. ఎలా లేదన్నా రోజుకు 2,3 లక్షలు సంపాదించే అవకాశం  పోయిందన్న బాధతో  సునీల్‌ మనసు మళ్లీ కమెడియన్‌ వేషాలవైపు మళ్లింది. హీరోగా సెటిలవ్వమని సలహా ఇచ్చిన దర్శకుడు కూడా సునీల్‌ను కమెడియన్‌గా నిలబెట్టే ఆఫర్స్‌ ఇవ్వకుండా మొహం చాటేశాడు.

హీరోయిజం పక్కన పెట్టేసిన మళ్లీ కమెడియన్‌గా మారిన సునీల్‌కు సెకండ్‌ ఇన్నింగ్స్‌లో అరకొర ఛాన్సులే వచ్చాయి. హాస్య నటుడిగా పూర్వవైభవం చూడాలనుకున్న సునీల్‌కు చుక్కెదురైంది. ఈ క్రమంలో...ఈ కమెడియన్‌ కాస్తా.. విలన్‌గా మారాల్సి వచ్చింది. ఎప్పటినుంచో విలన్‌గా నటించాలన్న కోరిక డిస్కోరాజాతో తీరినా.. డిజాస్టర్‌ కావడంతో.. సునీల్‌ పెర్‌ఫార్మెన్స్‌ హైలైట్‌ కాలేదు.మరో కమెడియన్ సుహాస్‌ హీరోగా నటించిన  'కలర్‌ ఫొటో'లో ప్రతినాయకుడిగా నటించి అదృష్టం పరీక్షించుకున్నా.. సినిమా ఓటీటీకే పరిమితమైంది.

కమెడియన్‌గా.. హీరోగా.. విలన్‌గా కనిపించిన సునీల్‌ మరోసారి కథానాయకుడు అవతారమెత్తాడు. హాస్య నటుడిగా ఒకటీ అర ఆఫర్సే రావడంతో.. హరీష్‌ శంకర్ ఇచ్చిన హీరో ఛాన్స్‌ను ఉపయోగించుకుంటున్నాడు. హరీష్‌ రాసుకున్న కథకు సునీల్‌ను హీరోగా సెలెక్ట్‌ చేశాడు. సినిమాకు 'వేదాంతం రాఘవయ్య' అన్న టైటిల్‌ పెట్టాడు. హరీశ్‌ దర్శకత్వంలో గద్దలకొండ గణేష్‌ తీసిన 14 రీల్స్‌ ప్లస్‌ ఈ సినిమాను నిర్మిస్తోంది. హరీష్‌ సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు దర్శకుడు.. ఇతర నటీనటులను ఎంపిక చేయాల్సి ఉంది. భారీ సినిమాల్లోతనదైన కామెడీ స్టైల్‌తో హైలైట్‌గా నిలిచిన సునీల్‌.. ప్రస్తుతం ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడనిపిస్తోంది. కావాల్సిన వ్యక్తి ఇచ్చిన సలహాలు సునీల్‌ను  ఎటూ కాకుండా చేశాయంటున్నాయి ఫిలిం వర్గాలు. మొత్తానికి తెలుగు సినిమా ఓ మంచి కమెడియన్ని మిస్‌ అవుతున్నామనే భావనలో ఉంది. మొత్తానికి సునీల్ చెప్పిన మాట వినకుండా నష్టపోయాడనే వాదన వినిపిస్తోంది.  కమెడియన్ మాంచి ఊపుమీదున్న సునీల్ ఎందుకు ఇలా చేశాడనే ప్రశ్నలు ఇప్పటికీ హాస్య అభిమానుల్లో నెలకొంది.







మరింత సమాచారం తెలుసుకోండి: