అందం, అభినయంతో పాటు నటనలో కూడా ఎంతో ప్రావీణ్యం పొందిన అలనాటి మేటి నటీమణుల్లో రాజసులోచన ఒకరు.. అచ్చ తెలుగు అమ్మాయిగా పుట్టిన రాజసులోచన బాల్యంలోనే నాట్యంలో ప్రావీణ్యం సంపాదించారు. ఆ కళనే ఆమెను కట్టిపడేసి, చెన్నపట్టణం చేర్చింది. ఆరంభంలో కన్నడ చిత్రాలలో అభినయించిన రాజసులోచన తరువాతనే మాతృభాషలో తళుక్కుమన్నారు. కన్నడ రాజ్ కుమార్ తొలి చిత్రం 'బేడర కన్నప్ప'. ఈ సినిమా తెలుగులో 'కాళహస్తి మహాత్మ్యం'గా తెరకెక్కింది. ఈ రెండు చిత్రాలలోనూ రాజసులోచన తన అందచందాలతో ఆకట్టుకున్నారు. ఆపై అనేక చిత్రాలలో నర్తకిగా, నాయికగా, గుణచిత్ర నటిగా నటిస్తూ సాగారు రాజసులోచన.కొన్ని చిత్రాలలో వ్యాంప్ గానూ అభినయించారు.

కొన్ని సినిమాల్లో కేవలం ఐటమ్ సాంగ్స్ లోనూ తళుక్కుమన్నారు. తన దరికి ఏ పాత్ర చేరినా, కాదనేవారు కాదు. మహానటులు యన్టీఆర్, ఏయన్నార్ తో నాయికగానూ నటించారు. వారి చిత్రాలలో నర్తనంతోనూ మురిపించారు. యన్టీఆర్ తో "పెంకిపెళ్ళాం, రాజమకుటం, వాల్మీకి, బభ్రువాహన, ఆప్తమిత్రులు" వంటి చిత్రాలలోనూ, ఏయన్నార్ జంటగా "శాంతినివాసం, శభాష్ రాజా, ఇద్దరు మిత్రులు" వంటి సినిమాల్లోనూ నటించారు. ఆ సినిమాలు నాయికగా రాజసులోచనకు మంచి పేరే సంపాదించిపెట్టాయి.

యన్టీఆర్ చెల్లెలుగా రాజసులోచన నటించిన 'మంచిమనసుకు మంచిరోజులు' చిత్రం అనూహ్య విజయం సాధించింది. అయినప్పటికీ నిర్మాతలు, దర్శకులు తనకు ఇచ్చిన పాత్రల్లో నటించడానికి ఆమె ఏ నాడూ వెనుకాడలేదు. అలా తెలుగు, కన్నడ, తమిళ, మళయాళ చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు..ఇక ఆమె వ్యక్తిగత జీవితం విషయానికొస్తే...ప్రముఖ దర్శకుడు, నటుడు సి.ఎస్.రావును వివాహమాడారు రాజసులోచన. సి.ఎస్.రావు దర్శకత్వంలో రూపొందిన పలు చిత్రాలలో రాజసులోచన కీలక పాత్రలు పోషించారు. వారికి ఇద్దరు కవల అమ్మాయిలు జన్మించారు. వారిలో ఒకరు అమెరికాలోనూ, మరొకరు చెన్నైలోనూ స్థిరపడ్డారు. 2013 మార్చి 5న తన 77వ యేట కన్నుమూశారు రాజసులోచన..అయినా కూడా అప్పటి తన అందచందాలతో, నటనతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: