"ప్రేమ దేశం" తెలుగు సినిమాలలో ఒక అద్భుతమైన కల్ట్ క్లాసిక్. ఇది తమిళ చిత్రం "కాదల్ దేశం" డబ్బింగ్ వెర్షన్ అయినప్పటికీ ఈ చిత్రం తెలుగులో పెద్ద విజయం సాధించింది. ఇది ఆ తరం యువతపై భారీ ప్రభావం చూపింది కూడా. ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన సంగీతం కూడా అన్ని భాషల్లో ఇప్పటికీ ఎవర్ గ్రీన్. ఈ సినిమాను చూసి ఫ్రెండ్ షిప్ ఇలా ఉండాలని, ప్రేమ ఇలా ఉండాలని ఫిక్స్ అయిపోయారు అప్పటి యూత్. "ముస్తఫా ముస్తఫా" సాంగ్ ఇప్పటికి ఈ తరం యువతకు కూడా ఫేవరేట్ సాంగ్. అబ్బాస్, వినీత్, టబు ప్రధాన పాత్రల్లో నటించిన "ప్రేమ దేశం" చిత్రానికి కతిర్ దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ టాలెంటెడ్ చిత్రనిర్మాత దాని సీక్వెల్ పనిలో ఉన్నాడని తెలుస్తోంది.

ఓ ఛానల్ కు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో "ప్రేమ దేశం" సీక్వెల్ పని జరుగుతున్నట్టు ఆయన అధికారికంగా ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ “మేము "కాదల్ దేశం" తెలుగులో "ప్రేమ దేశం" అని డబ్ చేసాము. అసలు వెర్షన్ కంటే డబ్బింగ్ వెర్షన్ పెద్ద హిట్ అయింది. ఆ కాలంలో ఇది ట్రెండ్‌ సెట్టర్. ఈ రోజుల్లో అలాంటి సినిమాలను మనం చూడలేము. ఈ విధంగా "ప్రేమ దేశం" లాంటి సినిమా తీయాలని చాలా మంది నన్ను రిక్వెస్ట్ చేశారు. చాలాసేపు ఆలోచించిన తర్వాత దానికి సీక్వెల్ చేయాలని నిర్ణయించుకున్నాను. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. పరిశ్రమ లోని ప్రతిభావంతులైన కొత్త వారు, అనుభవజ్ఞులైన నటులతో ఈ చిత్రాన్ని రూపొందించడానికి మేము ప్లాన్ చేస్తున్నాము. ప్రస్తుతం మేము నిర్మాతలు, నటుల కోసం వెతుకుతున్నాము” అని ఆయన అన్నారు.

సీక్వెల్ ఒరిజినల్ వెర్షన్ తెలుగులోనే ఉంటుందని, తరువాత తమిళంలో డబ్ చేస్తామని కతిర్ చెప్పాడు. "ప్రేమ దేశం తెలుగులో భారీ విజయం సాధించడంతో నేను సీక్వెల్ ఒరిజినల్ వెర్షన్‌ను తెలుగులోనే చేయాలనుకుంటున్నాను. తరువాత ఇది తమిళంలోకి డబ్ చేస్తాం. అందుకే నేను తెలుగు నటీనటులు, నిర్మాతల కోసం వెతుకుతున్నాను " అని కతిర్ పేర్కొన్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: