
ఈ వార్త విని మరోవైపు సచిన్ అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా పండగ చేసుకుంటున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... “సరిగ్గా 37 ఏళ్ల క్రితం అనగా 1987లో బాల్ బాయ్‌గా ఉన్నప్పటి నుండి ఆరు వరల్డ్ కప్ ఎడిషన్లలో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించే వరకు.. ప్రపంచ కప్‌లు ఎప్పుడూ నా హృదయంలో ప్రత్యేకంగా నిలిచిపోయాయి. ఇక 2011లో ప్రపంచ కప్ గెలవడం నా క్రికెట్ ప్రయాణంలో గర్వించదగిన క్షణం. ఈ మెగా టోర్నీలో పాల్గొనేందుకు ప్రపంచంలోని మేటి జట్లన్నీ భారత్ కు రావడం నేను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను. ఈ అద్భుతమైన టోర్నమెంట్ కోసం ఉత్సుకతతో ఎదురుచూస్తున్నాను. యువతీ యువకులకు ఈ టోర్నీ మంచి స్ఫూర్తిని ఇస్తుంది” అని అన్నారు సచిన్.
ఇకపోతే సచిన్ ను గ్లోబల్ అంబాసిడర్ గా నియమించిన ఐసీసీ.. టోర్నీని మరింత రసవత్తరంగా మార్చేందుకు ఈ క్రమంలో మరికొంత దిగ్గజ ఆటగాళ్లను అంబాసిడర్ లుగా ప్రకటించడం కొసమెరుపు. వారిలో వెస్టిండీస్ లెజెండ్ వివియన్ రిచర్డ్స్, ఇంగ్లండ్ ప్రపంచ కప్ విన్నింగ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్, ఆస్ట్రేలియా హిట్టర్ ఆరోన్ ఫించ్, శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్, న్యూజిలాండ్ క్రికెటర్ రాస్ టేలర్, టీమిండియా మాజీ ప్లేయర్ సురేశ్ రైనా, పాకిస్థాన్ ఆల్ రౌండర్ మహ్మద్ హఫీజ్, భారత మహిళల మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ఉన్నారు. ఈ ప్రపంచకప్ కు గ్లోబల్ అంబాసిడర్ గా సచిన్ ను నియమించడం గౌరవంగా భావిస్తున్నామని ఐసిసి మార్కెటింగ్ & కమ్యూనికేషన్స్ జనరల్ మేనేజర్ క్లైర్ ఫర్లాంగ్ తాజాగా చెపుకొచ్చారు.