భారత సైన్యం నేపథ్యంగా తెరకెక్కిన ఎన్నో సినిమాలు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాయి. వీర సైనికుల త్యాగాలను, ధైర్య సాహసాలను ఆధారంగా చేసుకుని రూపొందించిన చిత్రాలు దేశభక్తిని రెట్టింపు చేయడమే కాదు, ప్రతి భారతీయుడి గుండెను తాకేలా ఉంటాయి. ‘లక్ష్య’, ‘లొకీ కార్గిల్’, ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’, ‘షెర్షా’, ‘బార్డర్’, ‘గున్‌జన్ సక్సేనా’, ‘సర్జికల్ స్ట్రైక్’ వంటి ఎన్నో సినిమాలు ఈ నేపథ్యంలో రూపొందాయి. ఇప్పుడు అదే కోవలో మరో ఆసక్తికరమైన కథ ఆధారంగా ఒక బలమైన బయోపిక్ రూపొందనుందని సమాచారం. ఇది గల్వాన్ లోయలో వీరమరణం పొందిన తెలుగు యోధుడు కల్నల్ సంతోష్ బాబు జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందనున్న చిత్రం కావడం విశేషం.

తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లాకు చెందిన కల్నల్ సంతోష్ బాబు 2020లో చైనాతో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో ప్రాణత్యాగం చేశారు. ఆ ఘటన దేశవ్యాప్తంగా చర్చకు కేంద్రంగా మారింది. సంతోష్ బాబు ధైర్య సాహసాలు దేశవ్యాప్తంగా ప్రశంసలందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన జీవితంలోని పలు అంశాల ఆధారంగా 'ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్ 3' అనే పుస్తకం రాయబడింది. ఇప్పుడు అదే నవల ఆధారంగా బాలీవుడ్‌లో ఒక బయోపిక్ తెరకెక్కుతోంది.

ఈ సినిమాలో బాలీవుడ్ మాస్ హీరో సల్మాన్ ఖాన్, కల్నల్ సంతోష్ బాబు పాత్రలో నటించనున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటి వరకూ ‘టైగర్ జిందా హై’, ‘ఎక్ థా టైగర్’, ‘హీరోస్’ వంటి దేశభక్తి ప్రధానమైన చిత్రాల్లో నటించిన సల్మాన్.. ఇప్పుడు నిజమైన యోధుడి పాత్రను పోషించనున్నారన్న వార్త అభిమానుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. ఈ చిత్రం ఈ ఏడాది జూలైలో షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ముంబై, లద్దాఖ్ ప్రాంతాల్లో 70 రోజులపాటు చిత్రం చిత్రీకరణ జరగనున్నట్లు సమాచారం.

ఈ సినిమాకు 'షూట్ అవుట్ ఎట్ లోకండవాలా' ఫేమ్ అపూర్వ లఖియా దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. అనుభవజ్ఞుడైన ఆయన దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ బయోపిక్ దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. సల్మాన్ ఖాన్ గత చిత్రం ‘సికిందర్’ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, ఈ బయోపిక్‌తో మరోసారి ఘన విజయాన్ని అందుకోవాలని భావిస్తున్నారు. తెలుగు సైనికుడు కల్నల్ సంతోష్ బాబు జీవిత చరిత్ర ఆధారంగా సినిమా రూపుదిద్దుకోవడం తెలుగు ప్రజలకు గర్వకారణం. ఇటువంటి కథల ద్వారా వీరుల త్యాగాలను సమాజానికి పరిచయం చేయడమే కాకుండా, యువతలో దేశభక్తిని కలిగించడంలో కూడా కీలక పాత్ర పోషించవచ్చు. ఈ బయోపిక్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: