మంచు విష్ణు ప్రధాన పాత్రలో ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో తెరకెక్కిన కన్నప్ప సినిమాపై ఒకింత భారీ స్థాయిలోనే అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తుండగా ఈ సినిమా నైజాం, సీడెడ్ హక్కులు మైత్రీ నిర్మాతలు సొంతం చేసుకున్నారని వార్తలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. అయితే సినిమా రిలీజ్ కు కొన్ని వారాల ముందు ఈ సినిమా టీమ్ కు దిమ్మతిరిగే షాక్ తగిలింది.
 
ఈ సినిమాకు సంబంధించిన హార్డ్ డిస్క్ ను అనుమతి లేకుండా తీసుకెళ్లారంటూ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కన్నప్ప మూవీకి సంబంధించిన కీలకమైన కంటెంట్ ఉన్న హార్డ్ డిస్క్ ను ముంబైకు చెందిన హెచ్.ఐ.వీ.ఏ స్టూడియోస్ వాళ్లు డీటీడీసీ కొరియర్ ద్వారా ఫిల్మ్ నగర్ లో ఉన్న విజయ్ కుమార్ కార్యాలయానికి పంపారు. ఆఫీస్ బాయ్ రఘు ఈ నెల 25వ తేదీన ఆ పార్శిల్ ను తీసుకున్నారు.
 
అయితే హార్డ్ డిస్క్ తీసుకున్న విషయాన్ని రఘు ఎవరికీ చెప్పకుండా దానిని చరిత అనే మరో మహిళకు ఇచ్చాడని తెలుస్తోంది. అప్పటినుంచి రఘు, చరిత ఎవరికీ అందుబాటులోకి రాకుండా తిరుగుతున్నారని భోగట్టా. రఘు, చరిత ఈ విధంగా చేయడం వెనుక ఎవరో ఉన్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ హార్డ్ డిస్క్ దొంగతనం వెనుక ఎవరు ఉన్నారో తెలియాల్సి ఉంది.
 
పోలీసులు ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది. కన్నప్ప సినిమా రిలీజ్ ముంగిట ఊహించని ఇబ్బందులు ఎదురవుతుండటం గమనార్హం. హార్డ్ డిస్క్ దొంగతనం విషయంలో కుట్ర కోణం ఉందా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: