తెలుగు సినీ ఇండస్ట్రీలో మిడ్ రేంజ్ హీరోల పరిస్థితి ప్రస్తుతం అత్యంత ఆందోళనకరంగా మారింది. ఒకప్పుడు వరుసగా హిట్లు ఇస్తూ నిర్మాతలకు భరోసా ఇచ్చిన ఈ హీరోలు.. ఇప్పుడు ఫామ్‌ను కోల్పోయి, బాక్సాఫీస్‌ వద్ద పూర్తిగా నిరాశపర్చేస్తున్నారు. రవితేజను ఉదాహరణ తీసుకుంటే.. వాల్తేరు వీరయ్య, ధమాకా సినిమాలతో పునరాగమనం చేసినట్టే కనిపించింది. కానీ ఆ తర్వాత వచ్చిన మిస్టర్ బచ్చన్ రూ. 10 కోట్లను కూడా దాటలేదు. గోపీచంద్ తో వచ్చిన విశ్వం సినిమాకు టాక్ బాగుండగా కూడా, థియేటర్లకు ప్రేక్షకులు లేకపోవడం కలవరపాటుకు గురిచేసింది.


నితిన్, కళ్యాణ్ రామ్ లాంటి హీరోలు చాలా కాలంగా సరైన హిట్ లేక అటకెక్కిపోయినట్టే. గతంలో సక్సెస్ ట్రాక్‌లో దూసుకెళ్లిన వీళ్ళు ఇప్పుడు ఒక్క సరైన స్క్రిప్ట్ కోసం వెయిట్ చేస్తున్నట్టు కనిపిస్తున్నారు. మరోవైపు వరుణ్ తేజ్ కూడా మట్కాతో నిరాశపరిచారు. తమ్ముడు సినిమాకు ఓపెనింగ్స్ కూడా రాకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక విజయ్ దేవరకొండ సంగతి చూసినా ఆశాజనకంగా లేదు. ఖుషీ ఫర్వాలేదనిపించినా, ఫ్యామిలీ స్టార్ మాత్రం పూర్తి ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు ఆయన మొత్తం ఫోకస్ "ది కింగ్ డమ్" పై పెట్టారు, జూలై 31న ఈ సినిమా విడుదల కానుంది. దీని తర్వాత రాహుల్ సంకృత్యాన్, రౌడీ జనార్ధన సినిమాలతో మళ్లీ పుంజుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నారు.



ఈ పరిస్థితుల్లో నాని మాత్రమే తన విజ‌య‌ల‌ను కొనసాగిస్తున్నారు. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం, హిట్ 3 సినిమాలతో హ్యాట్రిక్ హిట్లు సాధించగా, ఇప్పుడు ప్యారడైజ్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. మొత్తంగా చూస్తే, స్టార్ హీరోలు రెండు సంవత్సరాలకు ఒక సినిమా చేస్తే, మిడ్ రేంజ్ హీరోలపైనే నిర్మాతలు ఆశలు పెట్టుకుంటున్నారు. కానీ వాళ్లు కూడా మిస్ అవుతుండటం వల్ల ఇండస్ట్రీలో రిస్క్ ఎక్కువవుతోంది. అయితే ఇదంతా కథలపై పెట్టే దృష్టి తక్కువవడమే కారణమని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. హనుమాన్ లాంటి చిన్న సినిమాలు కూడా మంచి కథతో రూ. 300 కోట్లు రాబడుతున్నాయంటే.. బడ్జెట్ కన్నా కంటెంట్‌ మీద ఫోకస్ పెడితే మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కడం కష్టం కాదు.ఇప్పుడు చూస్తే, మీడియం రేంజ్ హీరోలు ఇప్పుడు కథపై కేర్ తీసుకుని, డైరెక్షన్‌ను బలంగా ఎంచుకుంటే.. వాళ్లు మళ్లీ టాప్ రేంజ్‌లోకి వస్తారు. లేదంటే ఇండస్ట్రీలో వాళ్ల స్థానాలు కోల్పోవడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: