
సచివాలయం పక్కనే ఓ చిన్న బడ్డీ కొట్టు వేసుకుని, అక్కడే తన జీవితాన్ని స్థిరపరుచుకుంది. ఎన్టీఆర్ సచివాలయానికి వస్తూ, పోతూ ఉండగా, దూరం నుంచి ఆయనను చూసి ఆనందంతో మురిసిపోయేది. ఆ క్షణాల కోసం రోజులు, నెలలు, సంవత్సరాలు లెక్కపెట్టకుండా గడిపేసింది. 1995లో ఎన్టీఆర్ అనారోగ్యంతో పరమపదించారు. కానీ ఆయనపై సంగీతకు ఉన్న ప్రేమ, అభిమానానికి ఆ మరణం కూడా అంతం కాలేదు. నేటికీ… అవును, ఎన్టీఆర్‌ను మొదట చూసిన చోటే ఆమె బడ్డీ కొట్టు కొనసాగిస్తోంది. 42 ఏళ్లుగా అదే స్థలంలో వ్యాపారం చేస్తూ, అన్నగారి ఫొటోలు పెట్టుకుని వాటిని చూసుకుంటూ గడుపుతోంది. కొట్టుకు వచ్చే ప్రతి ఒక్కరికి తన కథ చెబుతూ, ఎన్టీఆర్‌పై తన అభిమానాన్ని పంచుకుంటూ కాలం గడుపుతోంది.
కానీ కాలం ఎవ్వరినీ వదలదు. యుక్తవయసులో ఎన్టీఆర్ కోసం నగరానికి వచ్చిన ఆ సంగీత, నేడు వృద్ధాప్యం దశలోకి అడుగుపెట్టింది. అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. సంపాదన కూడా తన రోజు వారీ జీవనానికి సరిపడేంత మాత్రమే. 42 ఏళ్లుగా ఒకే స్థలంలో తన అభిమాన నాయకుడి జ్ఞాపకాలతో జీవిస్తున్న ఈ అభిమాని, ఇప్పుడు ఒక్కటే ఆశతో ఉన్నారు – నందమూరి కుటుంబం నుంచి ఎవరో ఒకరు తనను ఆదుకోవాలి. ఎన్టీఆర్‌పై అజరామరమైన ప్రేమతో, తన ఊరిని వదిలి, జీవితాన్ని సచివాలయం పక్కన గడిపేసిన ఈ సంగీత గాథ… తెలుగు ప్రజల హృదయాలను కదిలించేలా ఉంది. నిజంగా, ఆమె త్యాగానికి గౌరవంగా నందమూరి వారసులు చేయూత అందిస్తారని ఆశిద్దాం.