ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన చిత్రాల్లో `త‌మ్ముడు` ఒక‌టి. కిక్ బాక్సింగ్ నేప‌థ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం 1999లో విడుద‌లైన ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. అయితే ఈ మూవీ హీరోయిన్ ప్రీతి జింగానియా గుర్తుందా? త‌న ఆక‌ట్టుకునే అందం, అందమైన చిరునవ్వుతో తొలి సినిమాతోనే ఈ బ్యూటీ తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ముంబైలో ఒక సింధీ కుటుంబంలో జన్మించిన ప్రీతి.. మొదటి సారి రాజశ్రీ ప్రొడక్షన్స్ వారి `యే హై ప్రేమ్` అనే మ్యూజిక్ ఆల్బంలో అబ్బాస్‌తో కలిసి నటించి గుర్తింపు పొందింది.


ఆ త‌ర్వాత ప‌లు యాడ్స్‌లో మెరిసిన ప్రీతి.. 1999లో `మళవిల్లు` అనే మూవీతో మ‌ల‌యాళంలోకి, `హ‌లో`తో త‌మిళంలోకి, `త‌మ్ముడు`తో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి ప్ర‌వేశింది. 2000లో యశ్‌రాజ్ బ్యానర్‌లో వచ్చిన `మొహబ్బతే` సినిమాలో చిన్న‌దే అయినా గుర్తుండిపోయే పాత్రలో నటించింది. అమీషా పటేల్, కిమ్ శర్మలతో పాటు ఆ కాలంలో న్యూ కమర్స్ లిస్ట్‌లో నిలిచింది. ఆ దెబ్బ‌తో ప్రీతి కొంత కాలం వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. ముఖ్యంగా నార్త్‌లో ఎక్కువ‌గా సినిమాలు చేస్తూ అక్క‌డే స్థిర‌ప‌డింది.
త‌మ్ముడు అనంత‌రం తెలుగులో `నరసింహ నాయుడు`, `అధిపతి`, `అప్పారావు డ్రైవింగ్ స్కూల్` త‌దిత‌ర చిత్రాల్లో క‌నిపించింది. అటు క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, పంజాబీ, ఉర్దూ, బెంగాలీతో ఇత‌ర భాష‌ల్లో అడ‌పా ద‌డ‌పా సినిమాల్లో న‌టించింది. హీరోయిన్‌గా కొన‌సాగుతున్న‌ప్పుడే 2008లో బాలీవుడ్ నటుడు పర్విన్ దబాస్ ను ప్రీతి వివాహం చేసుకుంది. వీరికి జైవీర్, దేవ్‌ అనే ఇద్ద‌రు కుమారులు ఉన్నారు. పిల్ల‌లు పుట్టాక ప్రీతి సినిమాలు చేయ‌డం త‌గ్గించేసింది.


ప్రస్తుతం కుటుంబ జీవితం, చిన్న చిన్న ఫిల్మ్ ప్రాజెక్టులు, సోషల్ వర్క్‌తో బిజీగా ఉంటుంది. అలాగే భర్త పర్విన్ తో కలిసి `స్వెన్ ఎంటర్‌టైన్‌మెంట్` అనే కంపెనీని ర‌న్ చేస్తోంది. ఈ సంస్థ ఫిల్మ్ ప్రొడక్షన్, ఈవెంట్ ప్రమోషన్, స్పోర్ట్స్ ప్రమోషన్స్ లాంటి ఫీల్డ్స్‌లో సేవ‌లు అందిస్తోంది. ప్రీతి `ప్రో పంజా లీగ్` అనే ఆర్మ్ రెజ్లింగ్ టోర్నమెంట్‌కు కో-ఫౌండర్‌గానూ ఉంది. ఇక‌పోతే ఆమె ఫిట్‌నెస్ ల‌వ‌ర్‌ కూడా. తరచూ యోగా, వర్కౌట్స్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. అయితే ప్రీతి అప్ప‌టికి ఇప్ప‌టికీ చాలా మారిపోయింది. రీసెంట్‌గా ఓ ర్యాలీలో ఆమెను చూసి చాలా మంది గుర్తుప‌ట్ట‌లేక‌పోయారు. ఫేస్‌లో ఛేంజ‌స్ వ‌చ్చిన‌ప్ప‌టికీ ప్రీతి త‌న ఫిజిక్‌ను మాత్రం ప‌ర్ఫెక్ట్‌గా మెయింటైన్ చేస్తుండ‌టం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: