ఇండస్ట్రీలో నాగ వంశికి ఉన్న పేరు, ప్రఖ్యాతులు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్‌బస్టర్ సినిమాలు తీసిన ప్రొడ్యూసర్లు కూడా సాధారణ ప్రేక్షకులకి పెద్దగా తెలిసే వారు కాదు. ఎందుకంటే ప్రేక్షకులు నిర్మాతల పాత్రను కేవలం సినిమాకు డబ్బు పెట్టడం వరకు మాత్రమే పరిమితం చేస్తూ చూసేవారు. కానీ ప్రొడ్యూసర్స్ కూడా సినిమాను ప్రమోట్ చేయగలరు, తమ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తం చేయగలరు అనే నిజాన్ని ఇండస్ట్రీకి నిరూపించిన వ్యక్తుల్లో ప్రముఖుడు నాగ వంశీ.

పలు సినిమాలతో ఇండస్ట్రీలో తనకి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వంశీ, ఆ తర్వాతి కాలంలో నిర్మాతలు కూడా మీడియా ముందుకు వచ్చి సినిమాలను ప్రమోట్ చేస్తూ, తమ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పడానికి ప్రేరణ పొందారు. తెలుగు సినిమా రంగంలో ఎంతోమంది నిర్మాతలు ఉన్నా, నాగ వంశీ పేరు వినగానే ప్రత్యేకంగా గుర్తించే అభిమానులు, మీడియా వర్గాలు ఉంటాయి. స్టేజ్‌పైకి ఎక్కి మైక్ పట్టుకున్న వంశీ మాట్లాడే తీరు, ఆయన ఉత్సాహం, ధైర్యం, చూసి రాజకీయ నాయకులకన్నా కూడా మించి మాట్లాడగల శక్తి ఉన్న నిర్మాత అని అనిపించక మానదు. వంశీ ప్రసంగాలు శ్రోతలను కట్టిపడేస్తాయి, ఆహ్లాదపరుస్తాయి, మరింత ఆసక్తికరంగా మారుస్తాయి. ప్రస్తుతం నాగ వంశీ విజయాలు, పరాజయాల మధ్య ఊగిసలాడుతున్నప్పటికీ, ఆయన తీసిన కొన్ని సినిమాలు ఘోర పరాజయం పాలవ్వగా, కొన్ని మాత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించి ఆయన ప్రతిష్టను నిలబెట్టాయి. వంశీ సాధారణంగా సోషల్ మీడియాలో ఎక్కువగా తన వ్యక్తిగత విషయాలను పంచుకోరు. అయితే ఈసారి మాత్రం ఆయన తన భార్య పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

సాధారణంగా సినీ ప్రముఖులు తమ భార్యలకి విష్ చేస్తే “ఆమె లేనిదే నేను లేను, నా విజయం వెనుక ఆమెే ప్రధాన కారణం. ఆమెనే మా ఇంటి దీపం” వంటి సినిమాటిక్ డైలాగులు చెప్పడం మనం తరచూ వింటుంటాం. అయితే నాగ వంశీ మాత్రం అలాంటి కవితాత్మకమైన మాటలు కాకుండా తనదైన ప్రత్యేక శైలిలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం ఆసక్తికరంగా మారింది.‘గబ్బర్ సింగ్’ సినిమాలో పవన్ కళ్యాణ్, శృతిహాసన్‌తో చెప్పిన “నువ్వు సుఖంగా ఉండు, నన్ను సుఖంగా ఉంచు” అనే డైలాగ్‌ను గుర్తుచేసే విధంగా నాగ వంశీ కూడా తన భార్యకు “హ్యాపీ బర్త్‌డే. నువ్వు సుఖంగా ఉండి, నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు” అంటూ సరదాగా రాసుకొచ్చారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేసిన కాసేపటికే వైరల్ అవ్వడంతో అభిమానులు కూడా పెద్ద ఎత్తున స్పందిస్తూ సరదా కామెంట్స్ చేస్తున్నారు.

“ఏంటి  వంశీ సార్… నువ్వూ భార్య బాధితుడివేనా?”, “నీకు కూడా ఇంట్లో తిప్పలు తప్పవా?”, “పెళ్లయ్యాక నువ్వూ బలైపోయావా?” అంటూ కామెడీగా రాసిన కామెంట్స్ పంచ్‌లా మారాయి. దీంతో ఈ సరదా పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. నాగ వంశీ సినిమాల విజయాలు, ఓటములు ఎలా ఉన్నా, ఆయన వ్యక్తిత్వం మాత్రం ఎప్పుడూ చురుకైనదే. సీరియస్ విషయాల్నీ సరదాగా చెప్పగలగడం, తన వ్యక్తిగత జీవితాన్ని ఓపెన్‌గా పంచుకోవడం, ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఆయన ప్రత్యేకత. ఈ కారణంగానే ఆయన నిర్మాతలలో ప్రత్యేకంగా నిలిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: