భారతీయ సినీ చరిత్రలో కొత్త యుగాన్ని ప్రారంభించిన చిత్రం ‘బాహుబలి’. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సృష్టించిన ఈ మాగ్నమ్ ఓపస్ ప్రపంచవ్యాప్తంగా భారత సినిమా స్థాయిని మరోస్థాయికి తీసుకెళ్లింది. ప్రభాస్, రానా దగ్గుబాటి, రమ్యకృష్ణ, అనుష్క శెట్టి, తమన్నా వంటి ప్రముఖ నటులు ఈ చిత్రంలో నటించి అద్భుతమైన ప్రదర్శనలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. 2015లో వచ్చిన ‘బాహుబలి: ది బిగినింగ్’, 2017లో వచ్చిన ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ ఈ రెండు సినిమాలు కలిపి ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్నడూ లేని రికార్డులను సృష్టించాయి.
ఇటీవల ఈ రెండు భాగాలను రీ-ఎడిట్ చేసి, ఒకే ఫార్మాట్‌లో ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో తిరిగి విడుదల చేశారు. రీ - రిలీజ్‌కి కూడా ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన రావడం, బాహుబలి బ్రాండ్ ఇప్పటికీ ఎంత బలంగా ఉందో మరోసారి నిరూపించింది. ఇక ఇప్పుడు ఈ సిరీస్‌కి సంబంధించిన మరో ఉత్కంఠభరితమైన అప్‌డేట్ బయటకొచ్చింది. బాహుబలి కథను విస్తరించి, కొత్త మాధ్యమంలోకి తీసుకెళ్లడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. బాహుబలి విశ్వాన్ని ఆధారంగా చేసుకొని రూపొందిస్తున్న కామిక్ సిరీస్ “బాహుబలి: ది ఎటర్నెల్ వార్ – పార్ట్ 1” అనే టైటిల్‌తో రాబోతోంది. ఈ యానిమేటెడ్ కామిక్ సిరీస్‌ను ఇషాన్ శుక్లా దర్శకత్వం వహిస్తుండగా, రాజమౌళి ప్రజెంట్ చేస్తున్నారు.
ఇటీవల విడుదలైన టీజర్‌లో బాహుబలి vs దేవేంద్రుడు మధ్య యుద్ధం ప్రారంభమవుతుందని చూపించారు. దేవతలు, అసురుల మధ్య జరిగే ఘోర సంగ్రామంలో బాహుబలి పాత్ర ఏమిటి? ఆయన ఎలా కొత్త విశ్వాన్ని ఆవిష్కరిస్తాడు? అనే ఆసక్తికరమైన ప్రశ్నలతో టీజర్ ముగుస్తుంది. ఈ సిరీస్‌ను 2027లో విడుదల చేయాలనే ప్రణాళికతో మేకర్స్ ముందుకు సాగుతున్నారు. అంటే, బాహుబలి విశ్వం మరోసారి కొత్త రూపంలో ప్రపంచ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి