నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్‌లో మరో భారీ మైలురాయిగా నిలవబోతున్న సినిమా ‘స్వయంభు’. ఇప్పటికే డిఫరెంట్ కంటెంట్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్… ఈసారి పూర్తి స్థాయి పిరియాడికల్ మైథలాజికల్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతుండటమే ఈ సినిమాపై భారీ అంచనాలకు కారణం. ఇప్పటివరకు రిలీజైన పోస్టర్లు, కాన్సెప్ట్ విజువల్స్ చూస్తే… ‘స్వయంభు’ కేవలం మరో సినిమా కాదు, ఒక విజువల్ ఎక్స్‌పీరియెన్స్ అన్న ఫీలింగ్ కలుగుతోంది. ఈ చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తుండగా… కథ, కథనంలో పూర్తిగా భారతీయ పురాణాల నేపథ్యం ఉండబోతుందన్న టాక్ వినిపిస్తోంది. మైథాలజీ + పిరియాడికల్ ఎలిమెంట్స్ అంటేనే భారీ స్కేల్, గ్రాండ్ విజువల్స్ అవసరం. అందుకే మేకర్స్ ఎక్కడా రాజీ పడకుండా ప్రతీ అంశాన్ని నెక్స్ట్ లెవెల్‌లో ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
 

ఇక ఇప్పుడీ సినిమాకు సంబంధించి వినిపిస్తున్న హాట్ టాపిక్ ఏంటంటే… స్టార్ వాయిస్ ఓవర్! ‘స్వయంభు’ కథా నేపథ్యాన్ని, పాత్రల పరిచయాన్ని ఓ పవర్‌ఫుల్ వాయిస్ ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేయాలన్న ఆలోచనలో టీమ్ ఉందట. అందులో భాగంగా తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను, హిందీలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్‌ను అప్రోచ్ అవుతున్నారన్న వార్త సినీ వర్గాల్లో హల్‌చల్ చేస్తోంది. ఎన్టీఆర్ గంభీరమైన వాయిస్, మైథలాజికల్ టచ్ ఉన్న డైలాగ్స్‌కి సూట్ అవుతుందని భావిస్తే… అజయ్ దేవగణ్ వాయిస్ హిందీ మార్కెట్‌లో సినిమాకు భారీ ప్లస్ అవుతుంది. మరి నిఖిల్ కోసం ఈ ఇద్దరు స్టార్లు తమ వాయిస్ ఇవ్వడానికి ఓకే చెబుతారా? లేదా? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. ఒకవేళ ఇది నిజమైతే… ‘స్వయంభు’ పాన్ ఇండియా క్రేజ్ ఒక్కసారిగా ఆకాశాన్ని తాకడం ఖాయం.

 

ఈ చిత్రంలో సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తుండగా… రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. కేజీఎఫ్, సలార్ వంటి సినిమాలతో తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పవర్ ఏంటో చూపించిన రవి బస్రూర్… ‘స్వయంభు’కి ప్రాణం పోస్తాడన్న అంచనాలు ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాధ్యతలను కె.కె. సెంథిల్ కుమార్ నిర్వహిస్తుండటం మరో భారీ ప్లస్. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాను నిర్మాత ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. ఫిబ్రవరి 13, 2026న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి ‘స్వయంభు’… నిఖిల్ కెరీర్‌లోనే కాదు, తెలుగు సినిమాల్లో కూడా ఓ స్పెషల్ మైథలాజికల్ ఎపిక్‌గా నిలవబోతుందన్న ఫీల్ ఇప్పుడే స్టార్ట్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: