ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ తాజాగా గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాలని స్పష్టం చేసింది. బయోమెట్రిక్ హాజరు ఆధారంగానే వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించనుందని ప్రకటన చేసింది. గత కొన్ని నెలలుగా కరోనా వ్యాప్తి, లాక్ డౌన్, వివిధ కారణాల వల్ల గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగులు విధులకు సరిగ్గా హాజరు కావడం లేదు.
 
ఉద్యోగులు విధులకు హాజరు కాకపోవడం వల్ల పలు ప్రాంతాల్లో ప్రజలకు సకాలంలో గ్రామ, వార్డ్ సచివాలయ సేవలు అందడం లేదు. దీంతో ప్రభుత్వం బయోమెట్రిక్ ద్వారా వేతనాల చెల్లింపులు జరిగేలా నిర్ణయం తీసుకుంది. వేతనాల చెల్లింపును బయోమెట్రిక్ హాజరుతో లింక్ చేయాలని మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలను జగన్ సర్కార్ ఆదేశించింది. బయోమెట్రిక్ హాజరు అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
 
జగన్ సర్కార్ గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగులకు సంబంధించి బయోమెట్రిక్ హాజరుకు ఇప్పటికే ప్రత్యేక యాప్ ను రూపొందించిన సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ 2020 సంవత్సరం ఫిబ్రవరి నుంచి గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగులకు బయోమెట్రిక్ తప్పనిసరి చేసింది. అయితే కరోనా వల్ల తాత్కాలికంగా బయోమెట్రిక్ హాజరుకు బ్రేక్ పడగా ప్రభుత్వం తాజాగా బయోమెట్రిక్ హాజరును తప్పనిసరి చేసింది.
 
గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగులు ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు విధులకు హాజరైనట్లు బయోమెట్రిక్ హాజరు నమోదు చేసుకుని, విధులు ముగించుకుని ఇంటికి వెళ్లే సమయంలో సాయంత్రం 5.30 గంటలకు రెండోసారి బయోమెట్రిక్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ప్రభుత్వం ఉద్యోగుల జీతాల్లో కోత విధించే అవకాశం ఉంటుంది. మరోవైపు వచ్చే నెల 20వ తేదీ నుంచి జగన్ సర్కార్ గ్రామ, వార్డ్ సచివాలయ పరీక్షలకు నిర్వహించడానికి సిద్ధమవుతోంది. దాదాపు 10 లక్షల మంది ఈ పరీక్షలకు హాజరు కానున్నారని తెలుస్తోంది.





మరింత సమాచారం తెలుసుకోండి: