
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ ఎమ్మెల్యేల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా జనసేన పార్టీకి సంబంధించి శాసనసభా పక్ష సమావేశాలు జరిగాయి. కొన్ని రోజుల క్రితం వరకు ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ తాజాగా ఎమ్మెల్యేలతో శాసనసభా పక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలకు 18 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. జనసేనను బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలని పవన్ ఎమ్మెల్యేలకు సూచించారని తెలుస్తోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నామినేటెడ్ పోస్టుల విషయంలో సైతం ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో కూటమి నేతలతో కలిసి పని చేయాలని పవన్ ఎమ్మెల్యేలకు సూచనలు చేశారు. అభిప్రాయం బేధాలు ఉంటే వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలని పవన్ కళ్యాణ్ కోరారు. దాదాపుగా గంట పాటు ఈ సమావేశం జరిగిందని సమాచారం అందుతోంది.
టీడీపీ, జనసేన మధ్య సమస్యలు రాకుండా ప్రధానంగా పవన్ సూచనలు చేశారని సమాచారం అందుతోంది. పవన్ ఫోటో లేదనే కారణంతో తాజాగా గన్నవరంలో జనసేన, టీడీపీ నేతల మధ్య విబేధాలు తలెత్తాయి. ఈ విషయాలు జనసేన కార్యకర్తలకు సైతం నచ్చడం లేదు. టీడీపీ సైతం సమన్వయ సమావేశాలు జరిపితే మాత్రమే ఈ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. నియోజకవర్గ స్థాయిలో ఈ సమావేశాలను నిర్వహించాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు.
గతంలో సమన్వయ సమావేశాలు నిర్వహిద్దామని చర్చ జరిగినా ఆచరణలో మాత్రం అమలులోకి రాలేదు. ఈ తరహా సమస్యలు తలెత్తకుండా పవన్ కళ్యాణ్ తన వంతు కృషి చేస్తున్నారు. మరోవైపు పవన్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల కానుందని తెలుస్తోంది. యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేయడం పక్కా అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.