టీడీపీ నేత‌ల వ్య‌వ‌హారం మ‌రోసారి చ‌ర్చ‌కు దారితీసింది. గ‌త ఏడాది ఎన్నిక‌ల త‌ర్వాత నాయ‌కులు సైలెంట్ అయిపోయిన విష‌యం తెలిసిందే. కొంద‌రు మాత్ర‌మే దూకుడుగా ఉన్నారు. చాలా మంది ఎవ‌రికి వారు త‌మ త‌మ ప‌నుల్లో బిజీ అయ్యారు. దీంతో పార్టీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించేందుకు, పార్టీ త‌ర‌ఫున వాయిస్ వినిపించేందుకు కేవ‌లం కొంద‌రు మాత్ర‌మే ముందుకు వ‌స్తోన్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది.  కీల‌క‌మైన గుంటూరు, అనంత‌పురం స‌హా ప‌లు జిల్లాల్లో ఇదే ప‌రిస్థితి కొన‌సాగుతోంది. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ప‌ట్టుబ‌ట్టి టికెట్లు సంపాయించుకుని, వార‌సుల‌ను నిలబెట్టిన కుటుంబాల నుంచి.. ఏళ్ల త‌ర‌బ‌డి పార్టీ టికెట్ పై విజ‌యం సాధిస్తూ.. గ‌త ఏడాది ఓడిపోయిన నాయ‌కుల వ‌ర‌కు ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

గుంటూరు జిల్లాకు చెందిన ధూళిపాళ్ల న‌రేంద్ర కుమార్.. ఆయ‌న తండ్రి వార‌స‌త్వంతో రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. త‌ర్వాత వ‌రుసగా పొన్నూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధిస్తూనే ఉన్నారు. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో మాత్ర‌మే ఆయ‌న ఓడిపోయారు. మ‌రి ఇన్నేళ్లు త‌న‌కు ఊతం ఇచ్చిన పార్టీని ఆయ‌న ప‌ట్టించుకున్న‌ది ఏమైనా ఉందా? అంటే.. ప్ర‌శ్న త‌ప్ప స‌మాధానం క‌నిపించ‌డం లేదు. ఏదో నామ్ కే వాస్తే .. అన్న‌ట్టుగా రావ‌డం.. జెండా ప‌ట్టుకోవ‌డం, నాలుగు మాట‌లు అనేయ‌డం మ‌ళ్లీ చాప‌చుట్టేయ‌డం క‌నిపిస్తోంది. ఏడాదిన్న‌ర‌లో ఆయ‌న మ‌న‌సుపెట్టి పార్టీ కోసం ప‌నిచేసింది ఎక్క‌డా లేదు.

కానీ, ఇప్పుడు అమూల్‌తో ప్ర‌భుత్వం ఒప్పందం చేసుకోగానే త‌న‌కున్న సంగం డైరీ వ్యాపారం దెబ్బ‌తినే సంకేతాలు వ‌చ్చాయి. దీంతో ఆఘ‌మేఘాల మీద మీడియా ముందుకు వ‌చ్చి జ‌గ‌న్ స‌ర్కారుపై విరుచుకుప‌డ్డారు. మ‌రి పార్టీ కోసం ఎందుకు ఇలా రాలేక పోతున్నార‌నేది పార్టీ నేత‌ల ప్ర‌శ్న‌. ఇక‌, అనంత‌పురం జిల్లాలో ప‌రిటాల కుటుంబాన్ని తీసుకున్నా.. జేసీ ఫ్యామిలీని తీసుకున్నా.. ప‌య్యావుల వ్య‌వ‌హారం తీసుకున్నా.. వారు పార్టీ త‌ర‌ఫున వాయిస్ వినిపిస్తున్న దానికంటే.. వ్య‌క్తిగ‌తంగా ఏదైనా ఇబ్బంది వ‌చ్చిన‌ప్పుడు స్పందిస్తున్న తీరు భిన్నంగా ఉంటోంది.

పార్టీకి, పార్టీ అధినేత‌కు ఇబ్బంది వ‌చ్చిన‌ప్పుడు కొంద‌రు ఇంట్లోనే ఉండ‌డం, మ‌రి కొంద‌రు తూతు మంత్రంగా బ‌య‌ట‌కు వ‌చ్చి ఓ మాట మాట్లాడేసి వెళ్లిపోవ‌డం జ‌రుగుతోంది. వ్య‌క్తిగ‌తంగా ఇబ్బంది వ‌చ్చిన‌ప్పుడు మాత్రం గగ్గోలు పెట్ట‌డంతో పాటు మాకు పార్టీ నుంచి మ‌ద్ద‌తు లేద‌ని పెడార్థాలు తీయ‌డం చేస్తున్నారు. పైగా త‌మ వ‌ర‌కు  వ‌చ్చేస‌రికి అల‌క‌లు, అసంతృప్తులు ఎక్కువ అయిపోతున్నాయి. మ‌రి పార్టీ అనేక సార్లు టికెట్ ఇచ్చింది. ప‌ద‌వులు ఇచ్చింది.. వార‌సుల‌కు కూడా అవ‌కాశం క‌ల్పించింది. అయినా.. వారికి పార్టీ త‌ర‌ఫున ప‌నిచేసేందుకు, మాట్లాడేందుకు రోడ్డెక్కేందుకు కూడా స‌మ‌యం ఉండ‌డం లేద‌ని టీడీపీలో సీనియ‌ర్లే గుస‌గుస‌లాడుతుండ‌డం గ‌మ‌నార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: