ధూళిపాళ్ళ నరేంద్ర... గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాలలో హైలైట్ అవుతున్న నాయకుడు. సంగం డైరీలో అక్రమాలకు పాల్పడ్డారని నరేంద్రని ఏసీబీ అరెస్టు చేసిన విషయం కూడా తెలిసిందే. అయితే నరేంద్రని అక్రమంగా అరెస్ట్ చేసారని టీడీపీ నేతలు, వైసీపీ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. కాదు కాదు నరేంద్ర అక్రమాలు చేశారు కాబట్టే అరెస్ట్ చేసారని వైసీపీ నేతలు వాదిస్తున్నారు. ఇలా టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్దం జరుగుతుండగానే నరేంద్రకి బెయిల్ వచ్చేసింది. ఇక బెయిల్ మీద బయటకు వచ్చిన నరేంద్రని టీడీపీ నేతలు వరసపెట్టి పరామర్శిస్తున్నారు.


అయితే నరేంద్రకు నేతల పరామర్శలతో పాటు ప్రజల సానుభూతి కూడా పెరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బెయిల్ కండిషన్లతో విజయవాడలోనే ఉంటున్న నరేంద్ర నియోజకవర్గానికి ఎప్పుడు వస్తారా? అని పొన్నూరు టీడీపీ శ్రేణులు ప్రజలు ఎదురుచూస్తున్నాయి. అలాగే పొన్నూరులో న్యూట్రల్‌గా ఉండే ప్రజలు సైతం నరేంద్ర పట్ల సానుభూతితో ఉన్నారని తెలుస్తోంది.


ఎందుకంటే నరేంద్రకు పొన్నూరులో మంచి ఫాలోయింగ్ ఉండేది. ధూళిపాళ్ళ ఫ్యామిలీ అంటే పొన్నూరులో క్రేజ్ ఎక్కువ. అందుకే ఆ ఫ్యామిలీనే పొన్నూరులో గత నాలుగు దశాబ్దాలుగా గెలుస్తూ వస్తుంది. ఇక నరేంద్ర అయితే వరుసగా అయిదుసార్లు విజయం సాధించారు. కానీ 2019 ఎన్నికల్లో మాత్రం జగన్ వేవ్‌లో స్వల్ప మెజారిటీ తేడాతో ఓడిపోయారు. నరేంద్రపై కిలారు రోశయ్య విజయం సాధించారు.


అయితే తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రోశయ్య, తనదైన శైలిలో పని చేసుకుంటూ వెళుతున్నారు. ఇక ఆయనకు సొంత బలం తక్కువగానే ఉన్నా, జగన్ ఇమేజ్ వల్ల వైసీపీకి నియోజకవర్గంలో ఇబ్బంది లేదు. కానీ నరేంద్రని అరెస్ట్ చేసిన తర్వాత పరిణామాలు మారిపోయాయి. నరేంద్ర అక్రమాలు చేశారని అరెస్ట్ చేశారుగానీ, అసలు రాజకీయ కారణాలు వేరుగా ఉన్నాయని ప్రజలకు అర్ధమవుతుందనే చెప్పొచ్చు. అందుకే ఆయన జైలుకు వెళ్లొచ్చాక, మరింతగా నరేంద్రపై సానుభూతి పెరిగి, రాజకీయంగా మంచి మైలేజ్ వచ్చిందనే చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: