రైతుల హ‌క్కుల‌ను ఆదాని, అంబానీల‌కు తాక‌ట్టు పెట్ట‌డానికి ప్ర‌ధాని మోడీ చేసిన నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా సంవ‌త్స‌రం పాటు రైతులు పోరాటం చేసార‌ని టీపీసీసీ అధ్య‌క్షులు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.  ఈ ఉద్యమంలో 700 మందికి పైగా రైతులు అమవీరులు అయ్యార‌ని,  మరణించిన రైతులకు నివాళులు, విజయం సాధించిన రైతులకు అభినందలు తెలపడానికి కాంగ్రెస్ ఓ  కార్యక్రమం చేపట్టింది. రైతులవి స‌హ‌జ మ‌ర‌ణాలు కావ‌ని..  ఇవి కేవ‌లం న‌రేంద్ర మోడీ చేసిన  హత్యలు అని వెల్ల‌డించారు.

 మోడీ ఎన్ని రకాలుగా హింసలు పెట్టినా ఉద్యమంలో రైతులు వెనుకకు తగ్గలేదన్నారు.  ఈ దేశానికి, రాష్ట్రానికి పట్టిన పీడ మోడీ, కేసీఆర్ లు అన్నారు రేవంత్.  రైతుల పోరాట ఫలితంగా మోడీ చట్టాలను వెనక్కు తీసుకుంటే.. అవి మా గొప్ప అంటూ కేసీఆర్ కు గులాబీ చీడ పురుగులు పాలాభిషేకం చేస్తున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.  మోడీ చట్టాలు తెచ్చినపుడు అసెంబ్లీలో వ్యతిరేకిస్తూ తీర్మానం చేయమంటే  టీఆర్ఎస్ చేయ‌లేద‌న్నారు.  టీఆర్ఎస్‌  ఒక్క రోజు రైతు ఉద్యమానికి మద్దతు పలకలేదని,  ఒక్క రైతును పరామర్శించలేద‌ని స్ప‌ష్టం చేశారు.  కేసీఆర్ ఒక్క పూట ధర్నా చేస్తేనే భయపడి మోడీ నల్ల చట్టాలను వెనక్కు తీసుకుంటే మరి రైతులు పండించిన పంటలకు ఎందుకు కొనేలా చేయడం లేదని ప్ర‌శ్నించారు రేవంత్‌రెడ్డి.

 కేసీఆర్  ఎప్పుడు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పని చేయలేదని,  కేసీఆర్, మోడీ ఇద్దరూ తోడు దొంగలే అని వెల్ల‌డించారు. మొదటి నుంచి మోడీకి కేసీఆర్ మద్దతు ఇస్తున్నాడు. నోట్ల రద్దు కాడి నుంచి త్రిబుల్ తలాక్ వరకు అన్ని రకాలుగా మద్దతు ఇచ్చారని గుర్తు చేసారు.  కల్లాలలో లక్షల టన్నుల ధాన్యం ఉందని,  వెంటనే రైతుల వ‌ద్ధ‌ ధాన్యం అంతా కొనాలనా్న‌రు. మోడీని అస‌లు నమ్మొద్దు.. మోడీ వెంటనే నల్ల చట్టాలను రద్దు చేసేలా పోరాటాలు చేయాలని పేర్కొన్నారు.  కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుంద‌ని,  వరి రైతులకు అండగా కాంగ్రెస్ పోరాటం చేస్తోంది అని రేవంత్ వెల్ల‌డించారు.  వరి వేస్తే ఉరి అని  స్వ‌యంగా  సీఎం పేర్కొంటున్నార‌ని,  కేసీఆర్ మోసాలను రైతులు అర్థం చేసుకోవాలి. వరి రైతులకు న్యాయం చేయకపోతే కేసీఆర్ కు ఉరి వేయాల‌న్నారు.  రాష్ట్రంలో ప్రతీ గింజ కొనే వరకు పోరాటం చేస్తామ‌ని,   రైతులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని రేవంత్‌రెడ్డి హెచ్చ‌రించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: