ఉన్న‌వాటితో స‌ర్దుకుపోవ‌డం సులువు అని చెబుతున్నారు జ‌గ‌న్. మ‌రి! స‌చివాల‌యం త‌ర‌లింపు, ఉద్యోగుల నివాస స్థ‌లాల ఏర్పాటు అన్న‌వి అంత సులువా? ఇప్ప‌టికే అమ‌రావ‌తి కేంద్రంగా రాజ‌ధాని ఏర్పాటు అయ్యాక కొంత అద‌న‌పు ఆర్థిక భారం వెచ్చిస్తూనే అవ‌స్థ‌లు పడుతున్న ప్ర‌భుత్వానికి కొత్త స‌చివాల‌యం అద‌న‌పు త‌ల‌నొప్పే! మ‌రి ఇప్పుడు క‌ట్టిన భ‌వ‌నాలు ఏం చేస్తార‌ని? ఇప్ప‌టికిప్పుడు పూర్తి స్థాయి భ‌వ‌నాల ఏర్పాటు, లేదా వాటికి అద్దెల చెల్లింపు అన్న‌వి అనుకున్నంత సులువు కాదు. అందుకే ఉద్యోగులు కూడా స‌చివాల‌య త‌ర‌లింపును స‌మ్మ‌తించ‌డం లేదు. ఇక స‌చివాల‌యం ఏర్పాటు లేదా ఇత‌ర వ‌సతుల ఏర్పాటు ఎలా ఉన్నా వెనుక‌బ‌డిన ప్రాంతాల‌కు అభివృద్ధి అందించ‌డమే స‌దాశ‌యం అని చెప్పిన జ‌గ‌న్ ఇప్ప‌టిదాకా ఆ ప్రాంతాల కోసం రాజ‌ధాని అన్న పేరు వాడ‌కుండానే ఏం చేశారో చెప్ప‌నేలేదు. ఇప్ప‌టిదాకా విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం రావాల్సిన డ‌బ్బులే రాక పోతుంటే మూడు రాజ‌ధానుల పేరిట అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ అంటూ ఎక్క‌డి నుంచి సొమ్ములు తెస్తార‌ని? ఓ విధంగా అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ మంచిదే కానీ నిధులు లేన‌ప్పుడు అభివృద్ధి ఎలా అన్న‌దే మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న.




రాజ‌ధాని పేరిట ఇప్ప‌టిదాకా ఉన్న సందేహాల‌కూ సందిగ్ధ‌త‌ల‌కూ మ‌ళ్లీ కొన‌సాగింపు ఇచ్చేలా చేశారు జ‌గ‌న్ త‌న మాట‌ల‌తో! దీంతో ఇప్ప‌టిదాకా ఉన్న డైలమా ఏదీ తీర‌లేదు స‌రిక‌దా కొత్త‌గా కొన్ని సందేహాలు రేగుతున్నాయి. విశాఖ కేంద్రంగా అభివృద్ధి చేయ‌డం సులువు అని చెబుతున్నారు స‌రే కానీ విశాఖ‌కు చెందిన ప్ర‌యివేటు ల్యాండ్ ను జ‌గ‌న్ త‌న ప్ర‌భుత్వ ప‌రం చేసుకోవ‌డం  సులువా? లేదా ఆ నెపంతో  భూముల పందేరానికి జ‌గన్ ఏమ‌యినా తెర‌లేపారా? ఏదేమ‌యిన‌ప్ప‌టికీ రాష్ట్ర రాజ‌ధాని ఏంట‌న్న‌ది ఇప్ప‌టిదాకా తేల్చ‌లేదు. అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ అన్న మాట మాత్ర‌మే చెబుతున్నారు కానీ అది కూడా అనుకున్నంత సులువు కాదు. నిధులు లేని ప్ర‌భుత్వానికి మూడు ప్రాంతాల పై ప్రేమ ఎలా ఉందో కానీ ప్రేమ‌కు అనుగుణంగా డ‌బ్బులయితే లేవు అన్న‌ది నిర్థార‌ణ‌లో ఉన్న నిజం.

ఇంకా చెప్పాలంటే..
మూడు రాజ‌ధానుల బిల్లు ను ఉప‌సంహ‌రించుకుని జ‌గ‌న్ ఇవాళ కొత్త ప్ర‌క‌ట‌న ఒక‌టి చేశారు. అలా అనేకంటే పాత విష‌యాల‌నే మ‌ళ్లీ చెప్పి మ‌న‌కు మ‌రోమారు చ‌రిత్ర‌ను వినిపించారు. ఇవ‌న్నీ ఎలా ఉన్నా, జ‌గ‌న్ అనుకున్న‌ది సాధించేందుకు ఇప్పుడు ఉన్న బిల్లులో ఉన్న త‌ప్పులు ప‌రిహ‌రించి కొత్త బిల్లును త్వ‌ర‌లోనే తీసుకురానున్నారు. ఇదే ఇవాళ్టి అసెంబ్లీలో  ఆయ‌న ప్ర‌సంగ సారాంశం. ఇదంతా బాగానే ఉంది అస‌లే అప్పుల‌తో నెట్టుకువ‌స్తున్న రాష్ట్రానికి నిధులు ఎలా వ‌స్తాయో ఓ అయోమ‌యమే! డ‌బ్బుల‌న్నీ సంక్షేమానివే అయితే అభివృద్ధి అందులో మూడు ప్రాంతాల అభివృద్ధికి అదేలేండి మూడు రాజ‌ధానుల అభివృద్ధికి ఎలా తీసుకు వ‌స్తారు నిధులు అన్న‌ది మాకెంతో డైలామాగా ఉంద‌ని పాపం రాజ‌ధాని రైతులు, ఉత్త‌రాంధ్ర వాసులు అంటున్నారు.
విశాఖ‌పై ప్రేమ కురిపించి అస్స‌లు అక్క‌డ పెద్ద‌గా ఏం ఖ‌ర్చు చేయ‌కుండానే డెవ‌ల‌ప్మెంట్  చేయొచ్చ‌ని చెబుతుంటే విని న‌వ్వి ఊరుకోవాలి అంతా! పోనీ ఆ విశాఖ‌ను అయినా వైసీపీ స‌ర్కారు డెవ‌ల‌ప్ చేసిందా అంటే అదీ లేదు. రాజ‌ధాని పురం పేరుతో చెబుతున్న మాట‌ల‌న్నీ హాయిగా వినేందుకు బాగున్నాయి. అభివృద్ధి వికేంద్రీకర‌ణ అనే మాట చాలా సెంటిమెంట్ వ‌ర్డ్ క‌నుక వినొచ్చు అలానే అనొచ్చు కానీ అవ‌న్నీ సాధ్యం అవుతాయా అన్న‌దే డైల‌మా!


మరింత సమాచారం తెలుసుకోండి: