ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓ వైపు వరదలతో ప్రజలు అల్లాడుతున్న సమయంలోనే.. శాసన సభ శీతాకాల సమావేశాల్లో జరుగుతున్న సంఘటనలు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. సభా సమావేశాల తొలిరోజు సాదాసీదాగా జరిగినప్పటికీ.... రెండో రోజు నుంచి టోటల్ సీన్ మారిపోయింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని సభ నుంచి తెలుగుదేశం పార్టీ నేతలు వాకౌట్ చేశారు. ఇక తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ చంద్రబాబు ఆవేదనకు గురయ్యారు. మళ్లీ ప్రజా క్షేత్రంలో గెలిచిన తర్వాతే సభలో కాలు పెడతా అని శపధం చేశారు చంద్రబాబు. ఈ పరిణామంపై చర్చ జరుగుతున్న సమయంలోనే అసెంబ్లీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూడు రాజధానుల ఏర్పాటు ప్రకటన అక్కడే ఆగిపోయింది. అనూహ్యంగా మూడు రాజధానుల ఏర్పాటు బిల్లును వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసింది. ఈ ప్రకటన సర్వత్రా ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఇప్పుడు మరో కీలక బిల్లును కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు శాసన మండలిలో గట్టి ఎదురు దెబ్బ తగులుతోంది. మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగిన మెజారిటీ లేకపోవడంతో... అసెంబ్లీ ఆమోదం పొందిన బిల్లులకు మండలిలో బ్రేక్ పడుతోంది. దీంతో అసలు మండలే అవసరం లేదని జగన్ తీర్మానం చేశారు. దీని ప్రతిని కూడా కేంద్రానికి పంపింది జగన్ సర్కార్. దీనిపై కేంద్రం కూడా వేగంగా నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే చాలా సార్లు ఒత్తిడి కూడా తీసుకువచ్చారు వైసీపీ ఎంపీలు. అయితే ఇప్పుడు అనూహ్యంగా మండలి రద్దు బిల్లును కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం ఉపసంహరించుకుంటోంది. బిల్లులకు సంబంధించి న్యాయ పరమైన చిక్కులు, న్యాయ స్థానంలో విచారణల కారణంగా జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ప్రస్తుతం శాసన మండలిలో వైసీపీ ప్రభుత్వానికి పూర్తి మద్దతు లభించింది. ప్రస్తుతం మండలిలో వైసీపీ సభ్యుల సంఖ్య రెట్టింపు అయ్యింది. ప్రస్తుతం మండలి ఛైర్మన్‌గా కూడా వైసీపీకి చెందిన మోసేన్ రాజు ఉన్నారు. దీంతో అసెంబ్లీ ఆమోదం పొందిన బిల్లులు ఇకపై మండలిలో కూడా సులువుగా పాస్ అవుతాయనే గట్టి నమ్మకం ప్రస్తుతం వైఎస్ జగన్‌లో ఉంది. అందుకే మండలి రద్దు బిల్లును జగన్ వెనక్కి తీసుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: