జనసేన ఆవిర్భావ సభలో పవన్ ప్రసంగం ఇలా అయిపోయిందో లేదో.. అలా మంత్రి పేర్ని నాని లైన్లోకి వచ్చారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ పవన్ ని విమర్శించారు. చిరంజీవి పేరెత్తలేదంటూ స్టార్ట్ చేసిన పేర్ని నాని.. జనసైనికులంతా కమ్మలని భుజానికెత్తుకోవాల్సిందేనని అన్నారు. కేవలం చంద్రబాబు కోసమే పవన్ కల్యాణ్ సభ పెట్టారని విమర్శించారు. అందరికీ నమస్కారాలు పెట్టిన పవన్, తనకు సినీ జీవితం ఇచ్చి, అన్నింటా అండగా నిల్చిన చిరంజీవికి నమస్కారం ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు పేర్ని నాని. తీగ లాంటి పవన్ జీవితానికి చిరంజీవి ఒక కర్రలాగా ఊతం ఇచ్చారని, అలాంటి అన్నయ్యకు పవన్ నమస్కారం పెట్టలేదని, భవిష్యత్తులో అయినా ఆ పని చేయాలని సూచించారు.

పవన్‌ కల్యాణ్‌ అంతిమ లక్ష్యం జగన్ ని వ్యతిరేకించడమేనని అన్నారు పేర్ని నాని. రాజకీయాల్లోకి వచ్చిన తొలి రోజు నుంచి పవన్ తన టార్గెట్ గా జగన్ ని చేసుకున్నారని, పైకి ఎన్ని మాటలు చెప్పినా జగన్‌ ని వ్యతిరేకించడమే పవన్ సిద్ధాంతం అన్నారు నాని. దేశ, రాష్ట్ర ప్రయోజనాలు అని మాట్లాడే పవన్ కల్యాణ్.. ఆయన పార్టీ పెట్టినప్పటినుంచి ఇప్పటి వరకు దేశ, రాష్ట్ర ప్రయోజనాలకోసం ఏ నిర్ణయం అయినా తీసుకున్నారా అని ప్రశ్నించారు. ఆయన నిర్ణయాల వల్ల ఎవరికి మేలు జరిగిందని అడిగారు. కేవలం టీడీపీకి మంచి చేయాలనే నిర్ణయాలనే పవన్ తీసుకుంటారని అన్నారు.

గెస్ట్ ఆర్టిస్ట్..
పవన్ కల్యాణ్ ఓ గెస్ట్ ఆర్టిస్ట్ అంటూ మండిపడ్డారు పేర్ని నాని. ఉండవల్లి, పెనుమాకలో రైతుల తరపున పోరాటాలు చేసింది జగన్, వైసీపీ అని వివరించారు నాని. పవన్ కల్యాణ్ ఒకరోజు విహార యాత్రకోసం వచ్చినట్టు అక్కడికి వచ్చారని, ఎవరి చేతినుంచో లంచ్ బాక్స్ తీసుకుని, పెరుగన్నం తినేసి అక్కడ్నుంచి వెళ్లిపోయారన్నారు. ఆయన ఓ గెస్ట్ ఆర్టిస్ట్ అన్నారు. అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అంటున్న పవన్ కల్యాణ్ కు మంత్రి మరో ప్రశ్న సంధించారు. ఆనాడు అమరావతిని కుల రాజధాని అని పవన్ విమర్శించారని, ఈనాడు ఆ మాట ఏమైందని అన్నారు. జనసేన దృష్టిలో కర్నూలే రాజధాని అని పవన్ ప్రకటించారని, ఇప్పుడెందుకు మాట మారుస్తున్నారని నిలదీశారు.

మొత్తమ్మీద పవన్ కల్యాణ్ స్పీచ్ తర్వాత వెంటనే మంత్రి పేర్ని నాని బలంగా కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ ఎవరెవరితో కలసినా ప్రయోజనం లేదని, వైసీపీయే 2024లో అధికారంలోకి వస్తుందని అన్నారు నాని. చంద్రబాబుని అధికారంలోకి తేవడమే పవన్ లక్ష్యం అని ఆ లక్ష్యం నెరవేరదని జోస్యం చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: