దశాబ్దాలుగా కుప్పం నియోజకవర్గంలో పాతుకుపోయున్న చంద్రబాబునాయుడును ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో ఓడించాలని జగన్మోహన్ రెడ్డి మహా పట్టుదలగా ఉన్నారు. 1989 నుండి 2019 ఎన్నికల వరకు ఓటమన్నదే లేని చంద్రబాబును ఓడించటం వైసీపీకి సాధ్యమేనా ? అంటే సాధ్యమనే చెప్పాలి. ప్రయత్నం గనుక సిన్సియర్ గా జరిగితే కుప్పంలో వైసీపీ జెండా ఎగిరేందుకు అవకాశముంది. అందుకనే జగన్ పదే పదే కుప్పంలో చంద్రబాబును ఓడించాలని చెబుతున్నది.





ఇంతకీ కుప్పంలో చంద్రబాబు విజయరహస్యం ఏమిటంటే ప్రత్యర్ధుల బలహీనతే. కాంగ్రెస్ పార్టీ మాత్రమే చంద్రబాబుకు ప్రత్యర్ధిగా ఉండేది. ఆ పార్టీ తరపున ఎవరు పోటీచేసినా, ఏజెంట్లుగా ఎవరున్నా వారిలో చాలామందిని చంద్రబాబు మ్యానేజ్ చేసుకునేవారని పార్టీలోనే ప్రచారముంది. ఏకైక ప్రత్యర్ధిపార్టీ నేతల్లో చాలామందిని మ్యానేజ్ చేసేయటంతో చంద్రబాబుకు ఎదురులేకుండా పోతోంది. అలాంటిది రాష్ట్ర విభజనతో సీన్ మారిపోయింది.






విభజన తర్వాత కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోవటంతో ఆ స్ధానంలో జగన్ నాయకత్వంలోని వైసీపీ నిలబడింది. జనాలు కూడా వైసీపీని ఆదరించారు. అనేక కారణాల వల్ల జగన్-చంద్రబాబు మధ్య ప్రత్యర్ధులని కాకుండా శతృత్వం పెరిగిపోయింది. దాంతో ప్రత్యర్ధి పార్టీ అయిన వైసీపీని మ్యానేజ్ చేసుకోవటం చంద్రబాబుకు సాధ్యంకాలేదు. అంతకుముందు టీడీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా చంద్రబాబు జోలికి ఎవరు వెళ్ళేవారు కాదు. అలాంటిది మొదటిసారి చంద్రబాబును ఎదిరించి జగన్ నిలబడ్డారు.





దాంతో 2014లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి జగన్ను చంద్రబాబు అనేకరూపాల్లో ఇబ్బందిపెట్టారు. వాటన్నింటినీ భరించి కూడా జగన్ నిలదొక్కుకున్నారు. దాంతో 2019లో అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. అప్పటినుండే కుప్పంపై కన్నేశారు జగన్. మొదటిసారి 2019 ఎన్నికల్లోనే కుప్పంలో చంద్రబాబు మొదటి రెండు రౌండ్లలో వెనకబడ్డారు. అధికారంలోకి రాగానే జనాల చిరకాల కోరికలను జగన్ నెరవేరుస్తున్నారు. అందుకనే స్ధానిక ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ స్వీప్ చేసేసింది.






దాంతో 2024లో కుప్పంలో చంద్రబాబును ఓడించటం కష్టంకాదని జగన్ కు అర్ధమైంది. చంద్రబాబు మ్యానేజ్మెంటుకు లొంగకుండా నిఖార్సయిన రాజకీయం చేయటం వల్లే చంద్రబాబుకు ఎదురుదెబ్బలు మొదలయ్యాయి. ఇదే పద్దతిని మరో రెండేళ్ళు కంటిన్యు చేస్తే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించటం పెద్ద కష్టమేమీకాదు. అందుకనే కుప్పం బాధ్యతలను ప్రత్యేకించి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల్లో పెట్టింది. పెద్దిరెడ్డి కూడా అంతే పట్టుదలతో ఉన్నారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఏమైనా అద్భుతం జరుగుతుందేమో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: