తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ చేతుల్లోంచి చంద్రబాబు చేతుల్లోకి వచ్చాక ఏనాడూ చంద్రబాబు సొంత బలంతో అధికారంలోకి రాలేదని చెబుతారు. ఎప్పుడూ ఏదో ఒక పార్టీతో పెట్టుకోవడం చంద్రబాబుకు రాజకీయ అలవాటుగా మారింది. ఈ పొత్తులే ఆయన పార్టీని కీలక సమయాల్లో ఆధికారంలోకి తెచ్చిపెట్టాయి.


అయితే పొత్తుల విషయంలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన వేసిన ఎత్తులు పారలేదు. నాలుగేళ్ల వరకూ బీజేపీతో దోస్తీ చేసి.. చివర్లో హ్యాండిచ్చిన చంద్రబాబు.. ఆమేరకు రాజకీయ మైలేజీ పొందలేకపోగా... ఉన్న అధికారం పొగొట్టుకున్నారు. సార్వత్రి, అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఇప్పుడు చంద్రబాబు పొత్తుల కోసం చూస్తున్నారు.


అవకాశం దొరికితే చంద్రబాబు మళ్లీ బీజేపీవైపు వెళ్లవచ్చని ఊహాగానాలు వచ్చాయి. సీఎం రమేశ్, సుజనా వంటి వారు బీజేపీకి వెళ్లడం కూడా ఆ ప్లాన్ లోభాగం అని భావించే వారూ ఉన్నారు. అయితే... చంద్రబాబు ఆశలపై బీజేపీ సీనియర్ నేత నీళ్లు జల్లారు. భవిష్యత్‌లో తమ పార్టీ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వదని బీజేపీ జాతీయ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్‌ కోఇన్‌చార్జ్‌ సునీల్‌ దేవధర్‌ ప్రకటించేశారు.


అంతే కాదు.. తెలుగుదేశం అదినేత చంద్రబాబునాయుడు జీవితంలో మళ్లీ ముఖ్యమంత్రి కాలేరని అన్నారు. ప్రస్తుతం ఆపార్టీకి సరైన నాయకుడు లేడన్నారు. రాష్ట్రంలో గతంలో జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ నాయకులు కోట్లాది రూపాయలు స్వాహా చేశారన్నారు. బాబు వస్తే జాబు వస్తుందంటూ చివరకు చంద్రబాబు తన కుమారుడు లోకేషుకు మాత్రమే జాబు ఇప్పించుకుని నిరుద్యోగులను నిలువునా మోసం చేశారని తెలిపారు.

రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు గొప్ప మార్పు కోరుకున్నారన్నారు. రాష్ట్రంలో 25లక్షల మందిని బీజేపీలో చేర్పించాలని లక్ష్యం పెట్టుకున్నామని సునీల్ దేవధర్ అన్నారు. సునీల్ దేవధర్ వ్యాఖ్యలు తెలుగుదేశం నేతల్లో కలకలం సృష్టిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: