ఎన్నికల తర్వాత వరుస వలసలతో టీడీపీ డీలా పడిపోయిది. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి కనీసపోటీ కూడా ఇవ్వకుండా మరీ 23 సీట్లకే పరిమితం కావడంతో ఆ పార్టీలో ఫ్యూచర్ లేదని నేతంతా మిగిలిన పార్టీలవైపు క్యూ కడుతున్నారు. అయితే వైసీపీలో లేదంటే బీజేపీలో చేరిపోతున్నారు. తాజాగా.. విశాఖ జిల్లాలో తెలుగుదేశం కీలక నాయకులు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.


విశాఖ డైరీ చైర్మన్‌ అడారి తులసిరావు కుమారుడు అడారి ఆనంద్‌, కుమార్తె రమాకుమారి, విశాఖ డైరీ బోర్డు సభ్యులు, ఇతర నాయకులు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆదివారం వైయస్‌ఆర్‌సీపీ కండువా కప్పుకున్నారు. గత ఎన్నికల్లో అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసిన అడారి ఆనంద్‌ పరాజయం పాలయ్యారు. రైతులను ఆదుకుంటామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామినిచ్చిందని... గత టీడీపీ ప్రభుత్వం రైతుల్ని ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని అడారి ఆనంద్ తెలిపారు.


తాను స్వార్థం కోసం వైఎస్సార్‌సీపీలో చేరలేదని.. వైయస్‌ జగన్‌ పాలనపై నమ్మకం, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, రైతు సంక్షేమ పథకాలు ఎంతో బాగున్నాయనే చేరామని అంటున్నారు. రైతుల పక్షాన నిలబడే ప్రభుత్వం తరపున పనిచేద్దామనే పార్టీలోకి వచ్చాం అన్నారు ఆనంద్.


అయితే.. అడారి ఆనంద్ ఇచ్చిన షాక్ తోనే చంద్రబాబు నీరసపడిపోతే... మరో బాంబు పేల్చారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి త్వరలో మరిన్ని ఆసక్తికర చేరికలు ఉంటాయని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. మీరు చూస్తూనే ఉండండి... త్వరలో మరిన్ని ఆసక్తికర చేరికలు ఉండబోతున్నాయని వెల్లడించారు. అధికారం కోల్పోయాక కూడా చంద్రబాబు తీరు మార్చుకోలేదని, దీంతో టీడీపీ నేతలు విసిగిపోతున్నారని చెప్పారు.


చంద్రబాబు యూటర్నులు తీసుకున్నట్టే పవన్‌ కూడా రాజధాని విషయంలో యూటర్న్‌ తీసుకున్నారని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. గతంలో అమరావతి ప్రాంతం రాజధానికి అనుకూలం కాదని చెప్పిన వ్యక్తి, నేడు యూటర్న్‌ తీసుకుని మాట్లాడటం ప్రజలు గమనిస్తున్నారని విజయసాయి చురకలంటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: