కేసీఆర్ కేబినెట్ ను విస్తరించబోతున్నారు.. మరో ఐదు, ఆరుగురికి మంత్రి వర్గంలో చోటు కల్పించవచ్చు.. ఒకరిద్దరికి ఉద్వాసన కూడా ఉండొచ్చు. ఇది కేబినెట్ విస్తరణా, కేబినెట్ ప్రక్షాళనా అన్నది రేపు సాయంత్రానికి కానీ తేలకపోవచ్చు.. ఇక విస్తరణ విషయానికి వస్తే.. కేసీఆర్ కేబినెట్లో మంత్రులుగా నలుగురైదురి పేర్లు బాగా వినిపిస్తున్నాయి. అందులో ఒకరిద్దరి విషయంలో అనుమానం ఉన్నా.. మూడు పేర్లు మాత్రం పక్కాగా తేలాయి.


అవేమిటంటే.. హరీశ్ రావు, కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి.. వీరు కాకుండా ఇంకా పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతీరాథోడ్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇంకా ఇవేకాకుండా మరికొన్ని పేర్లు వినిపిస్తున్నా.. వాటికి అంత గ్యారంటీ లేదు. ఇక గ్యారెంటీగా వచ్చే జాబితాలో హరీశ్ రావు, కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి ఉన్నారు..


వీరిలో అందరిలోనూ ఆసక్తి రేపుతున్న పేరు హరీశ్ రావు.. పార్టీలో కేసీఆర్ తర్వాత అంతటి కీలక నేతగా ఉన్న హరీశ్ రావును కొంత కాలంగా కేసీఆర్ దూరం పెడుతున్న సంగతి తెలిసిందే. మంత్రి వర్గం లో మొదటి విడతలోనే హరీశ్ కు స్థానం కల్పించకపోవడం అప్పట్లో సంచలనం అయ్యింది. కానీ ఇప్పుడు తెలంగాణలో సెకండ్ ప్లేస్ కోసం బీజేపీ గద్దలా కాచుకు కూర్చున్న తరుణంలో ఆ పార్టీకి హరీశ్ రావు రూపంలో అవకాశం ఇవ్వదలచుకోలేదు కేసీఆర్.


అందుకే హరీశ్ పేరు దాదాపు గా ఖాయమైపోయింది. ఇక మరో పక్కా పేరు కేటీఆర్.. పార్టీ పగ్గాలు అప్పజెప్పడం కోసం అప్పట్లో కేటీఆర్ ను పక్కకు పెట్టారు. తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే పార్టీని చూసుకునేందుకు కూడా కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగించారు. కానీ ఇప్పుడు కేసీఆర్ కు జాతీయ రాజకీయాల్లో పని లేదు. అందుకే కేటీఆర్ ను మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇక సబితా ఇంద్రారెడ్డికి పార్టీలో చేరే సమయంలోనే కేసీఆర్ మంత్రిపదవి హామీ ఇచ్చారు. అందులోనూ తెలంగాణ మంత్రివర్గంలో మహిళకు ఛాన్స్ దక్కలేదు. ఆ లోటు సబితా ఇంద్రారెడ్డితో పూడే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: