పల్నాడు వివాదాలకు కేంద్రంగా మారింది. దీంతో ఖాకీలకు కంటి మీద కునుకు లేకుండాపోతోంది. నిన్న మొన్నటి వరకూ పొలిటికల్‌ హీట్‌ ఉంటే... ఇప్పుడు ఓ అత్యాచారం కలకలం రేపుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య వివాదానికి తెరలేవడంతో పోలీసులకు కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది.  


గుంటూరు జిల్లా పల్నాడులో వరుస ఘటనలు కలకలం రేపుతున్నాయి. మొన్న ఆత్మకూరు ఘటన సంచలనం రేపింది. ఇప్పుడిప్పుడే అక్కడ పరిస్థితి మెరుగవుతోందనుకుంటే... బాలికపై అత్యాచారంతో పల్నాడు ఉలిక్కిపడింది. సంఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే నిందితుడైన 17 ఏళ్ల బాలుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే ఇప్పుడు బాలికపై జరిగిన లైంగిక దాడి మతవిద్వేషాలకు ఆజ్యం పోసింది. గతంలో కూడ ఇదే మతానికి చెందిన బాలికపై అత్యాచారం జరిగింది. తమ మతాన్నే టార్గెట్ గా చేసుకొని అత్యాచారాలు జరుగుతున్నాయని ఆందోళనలు జరిగాయి. నిందితుడు అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరుడనే ఆరోపణలు వచ్చాయి. 


ఈ వ్యవహారంపై సీఎం జగన్‌ కూడా స్పందించడంతో బాధిత కుటుంబానికి అండగా నిలిచేందుకు ముందుకొచ్చారు మంత్రులు. బాధితురాలిని పరామర్శించడంతో పాటు 5 లక్షలు రూపాయల ఆర్థికసాయం, ఇంటి స్థలం ఇస్తామని ప్రకటించారు. మరోవైపు... పల్నాడులో శాంతిభద్రతలు లేవంటూ ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలకు కౌంటర్‌ ఇస్తున్నారు అధికార పార్టీ నేతలు.  పల్నాడులో ప్రశాంత వాతావరణం ఉందన్నారు హోంమంత్రి సుచరిత. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పల్నాడులో ప్రశాంత వాతావరణం నెలకొని ఉందంటున్నారు పోలీసులు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగడం లేదంటున్నారు. మొత్తానికి పల్నాడులో వరుస వివాదాలు అటు ప్రభుత్వానికి ఇటు పోలీసులకు సవాలుగా మారాయి. లైంగిక దాడికి పాల్పడితే ఫోక్సో చట్టం కింద శిక్షిస్తామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నా.. అవేమీ లెక్కలోకి తీసుకోవడం లేదు కొందరు. తర్వాత చూద్దాంలే అని బరితెగిస్తున్నారు. మహిళా, ప్రజా సంఘాలు, బాధితుల బంధువులు నిందితులకు వెంటనే కఠిన శిక్ష అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: