క‌రీంన‌గ‌ర్‌లో క‌ల‌క‌లం చోటుచేసుకుంది. ఆర్టీసీ డ్రైవ‌ర్‌ బాబు అంతిమయాత్ర తీవ్ర ఉద్రిక్తత జ‌రిగింది. ఆర్టీసీ బస్టాండ్ వైపు భౌతిక‌కాయాన్ని తీసుకెళ్లడానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో కార్మికులు నినాదాలతో హోరెత్తించారు. కార్మికులకు, పోలీసులకు మధ్య భారీ తోపులాట మధ్యన అంతిమయాత్ర కొనసాగుతుండ‌గా...పోలీసులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌పై చేయి చేసుకున్న‌ట్లు ప‌లు మీడియాల్లో ప్ర‌సారం జ‌రిగింది.  దీంతో ఒక్క‌సారిగా క‌ల‌క‌లం రేగింది.

ఈ ప‌రిణామంపై ఎంపీ బండి సంజ‌య్ స్పందిస్తూ...ఎంపీపై దాడి చేయడం ఏంటని ప్రశ్నించారు.  ఎంపీని కాలర్ పట్టుకొని కొడుతరా అని సీరియస్ అయ్యారు. శాంతియుతంగా బాబు అంతిమయాత్ర చేస్తుండగా..పోలీసులు శవాన్ని ఎత్తుకెళ్లడం దారుణమన్నారు. పేద కార్మికుడు చనిపోతే పోలీసులు విధ్వంసం సృష్టించారని..లా అండ్ కాపాడాల్సిన పోలీసులు సీఎం ఆర్డరుతోనే క్రూరంగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. బస్టాండ్ వైపు బాబు అంతిమయాత్రను తీసుకెళ్లేందుకు కార్మికులు తీవ్రంగా శ్రమిస్తుండ‌గా.... పోలీసులు రోప్ పార్టీలు, బారికేడ్లు పెట్టి బాబు అంతిమయాత్రను స్మశానంవైపు దారి మళ్లించారని మండిప‌డ్డారు. ఈ క్రమంలోనే కొంతమంది కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, వారిని అడ్డుకోబోతే...త‌న‌ప‌ట్ల దురుసుగా ప్ర‌వ‌ర్తించార‌ని ఆక్షేపించారు. కేసీఆర్ ప్రభుత్వంలో పోలీసులు దారుణంగా వ్యవహారిస్తున్నారన్నారు. కార్మికుల ఉసురు కేసీఆర్ కు తగులుతుందన్నారు.

కాగా,  ఓ పోలీస్ అధికారి  కరీంనగర్  ఎంపీ బండి సంజయ్‌పై చేయి చేసుకోవడం గ‌ర్హ‌నీయ‌మ‌ని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి అన్నారు. ఇది తెలంగాణ ప్రభుత్వ దమన నీతికి, దుర్మార్గానికి పరాకాష్ఠ అన్నారు. వెంటనే  డీజీపీ మహేందర్ రెడ్డి స్పందించి కరీంనగర్ పోలీస్ కమిషనర్, ఏసీపీలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. నిన్నటి వరకు బీజేపీ కార్యకర్తలు, నాయకుల మీద కక్ష సాధింపు చర్యలుగా తప్పుడు కేసులు బనాయించి  వేధించిన పోలీసులు ఏకంగా కేసీఆర్ మెప్పు కోసం, కేసీఆర్ ఆదేశాల మేరకు బీజేపీ నాయకుల మీద తమ ప్రతాపాన్ని చూయిస్తున్నారన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆ అధికారులను వెంటనే బ‌ర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: