మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వచ్చి వారం దాటుతున్నా ఇంకా ప్రభుత్వం ఏర్పడలేదు. సీఎం సీటు పంపకంపై శివసేన పట్టువీడకపోవడం ఈ ప్రతిష్టంభనకు కారణమైంది. అయితే ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ట్రపతిపాలన తప్పదట. ఈ మాట చెబుతున్నది సాక్షాత్తూ బీజేపీకి చెందిన నాయకులే.


మహారాష్ట్రలో నవంబర్ 7 నాటికి కొత్త ప్రభుత్వం ఏర్పడకపోతే రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందని మహారాష్ట్ర బీజేపీ లీడర్ సుధీర్ ముంగంటివార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే.. ప్రస్తుత శాసనసభ పదవీకాలం ఈనెల 8న ముగుస్తోంది. ఈలోగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే టెక్నికల్ గా రాష్ట్రపతి పాలన అనివార్యం అవుతుందని సుధీర్ చెబుతున్నారు.


ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే దీపావళి వచ్చింది. దీంతో బీజేపీ -శివసేన మధ్య చర్చలు ఆలస్యం అయ్యాయి. త్వరలోనే చర్చల ప్రక్రియ ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.అక్టోబర్ 21న జరిగిన ఎన్నికల ఫలితాల్లో భాజపాకు 105, శివసేనకు 56 సీట్లు వచ్చాయి. ఎన్సీపీకి 54, కాంగ్రెస్ కి 44 సీట్లు వచ్చాయి. మహారాష్ట్రలో.. ముఖ్యమంత్రి పదవి ఎవరు చేపట్టాలనే విషయంపై భాజపా-శివసేనల మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది.


సీఎం సీటుపై శివసేన పట్టువీడకపోతే... డైరెక్టుగా అమిత్ షా రంగంలోకి దిగుతాయని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఎన్సీపీతో కలిసి శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే ఊహాగానాలు కూడా వచ్చాయి. అయితే మేం ప్రతిపక్షంలోనే ఉంటాని కాంగ్రెస్, ఎన్సీపీ తేల్చి చెప్పేశాయి. ఈ మేరకు ఎన్సీపీ శాసనసభాపక్ష నేత అజిత్ పవార్ క్లారిటీ ఇచ్చేశారు.


ప్రజలు తమను ప్రతిపక్షంలోనే ఉండమని తీర్పు చెప్పారని అజిత్ పవార్ పేర్కొన్నారు. ఇక ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ -శివసేన కూటమే తేల్చుకోవాల్సి ఉంది. మరి ఈ కూటమి ఏదో ఒక పాయింట్ వద్ద రాజీపడి అధికారం అందుకుంటుందా.. లేక.. మిత్రబేధంతో రాష్ట్రపతి పాలనకు అవకాశం ఇస్తుందా చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: