నవంబర్ 6.. 2017.. ఈ రోజుకు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఓ ప్రత్యేకత ఉంది. ఏంటో గుర్తొచ్చిందా.. రాలేదా.. ఇదే రోజు.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టాడు. తండ్రి ఆశయాలే స్ఫూర్తిగా, తల్లి ఆశీస్సులే అండగా, వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘ ప్రజా సంకల్పం’ పాదయాత్ర ఇడుపులపాయలో మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి సమాధి సాక్షిగా ప్రారంభమైంది.


వందా.. ఐదు వందలు కాదు.. ఏకంగా 3648 కిలోమీటర్ల పాటు ఆ పాదయాత్ర సాగింది. సుదీర్ఘ పాదయాత్రతో మళ్లీ తండ్రిని తలపించాడు. ఆ నమ్మాకాన్ని ప్రజల్లో కలిగించాడు. జనం గుండెల్లో దాగి ఉన్న బాధను తెలుసుకున్నాడు. ఆనాడు జగన్ తీసుకున్న ఆ నిర్ణయమే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించి పెట్టిందనడంలో సందేహం లేదు.


2017 నవంబర్‌ 6వ తేదీన ప్రజా సంకల్పయాత్ర పేరిట వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేపట్టారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగులకు స్వాంతన చేకూర్చేందుకు జగన్ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. జగన్ కు ఈ పాదయాత్రలో జనం బ్రహ్మరథం పట్టారు. పాదయాత్రగా వస్తున్న జననేతకు తమ సమస్యలు చెప్పుకుందామని దారిపొడవునా వినతులు పట్టుకొని, గుండె నిండా బాధ నింపుకొని వచ్చారు.


వచ్చిన వారిని అంతే ఆప్యాయంగా పలకరిస్తూ.. వారి సమస్యను తెలుసుకుంటూ.. నేనున్నాను అవ్వా.. అమ్మా.. చెల్లి, అక్కా.. తాతా.. తమ్ముడు అంటూ అచ్చం రాజన్నను గుర్తు చేశాడు. వైయస్‌ జగన్‌ పాదయాత్రకు జిల్లా జిల్లాకు ఆదరణ పెరుగుతూ వచ్చింది. ఈ పాదయాత్ర సమయంలోనే విశాఖ ఎయిర్‌పోర్టులో జననేతపై హత్యాయత్నం కూడా జరిగింది. అయినా యాత్ర ఆగలేదు. మొత్తం 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు.


నేను విన్నాను.. నేను ఉన్నాను అంటూ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో సభలో మాట్లాడిన వైయస్‌ జగన్‌.. పాదయాత్రలో ప్రజల నుంచి వచ్చిన సలహాలు, సూచనలతో కేవలం రెండు పేజీలతో వైయస్‌ఆర్‌ సీసీ ఎన్నికల మేనిఫెస్టో తయారు చేసి ప్రజల్లోకి వెళ్లాడు. ఒక్క అవకాశం ఇవ్వండి.. ప్రజలు మెచ్చే పాలన అందిస్తానని చెప్పాడు. వైయస్‌ జగన్‌ పడిన కష్టానికి ప్రజలు 151 అసెంబ్లీ సీట్లు ఇచ్చి అక్కున చేర్చుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: