తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 47వ రోజుకు చేరుకుంది. అయినా గాని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా ఉంది కార్మికుల పరిస్దితి. ఇక సమ్మెపై తుది నిర్ణయం ఈ రోజు తీసుకోనున్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ నేతలు. అఖిల పక్షం నేతలు సమావేశమై.. భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించనున్నారు.

 

 

ఇదే కాకుండా ఆర్టీసీలో రూట్ పర్మిట్లపై మరోవైపు దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరగనుంది. కాగా, హైకోర్టు తీర్పు తర్వాత దీక్ష విరమించిన జేఏసీ నేతలు, సడక్ బంద్, రాస్తారోకోలను వాయిదా వేశారు. ఇకపోతే మంగళవారం సమావేశమైన జేఏసీ, అఖిలపక్ష నేతలు.. సమ్మెపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం జరిగినా, సమ్మె కొనసాగుతుందని కార్మిక సంఘాలు తెలుపుతున్నాయి.

 

 

ఇక కోర్టు జడ్జిమెంట్ కాపీ వచ్చిన తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామని జేఏసీ నేతలు తెలిపారు. అయితే, జడ్జిమెంట్ కాపీ కూడా జేఏసీ నేతలకు ఇప్పటికే అందినట్టుగా తెలుస్తుండగా... ఇవాళ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ననే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఇకపోతే కార్మికుల సమస్యలు త్వరగా పరిష్కరించాలని కోరుతూ, అఖిలపక్షం నేతలు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు గవర్నర్‌తో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై ఫిర్యాదు చేయనున్నామని తెలిపారు.

 

 

ఇదే కాకుండా విపక్షాలపై ప్రభుత్వం దాఖాలు చేసిన అఫిడవిట్‌పై  కూడా ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. ఇదే కాకుండా ఆర్టీసీ కార్మికులు ఆత్మత్యాగాలు చేసుకుంటున్నా సీఎం కేసీఆర్ స్పందించకపోవడం దారుణమని, రాష్ట్రంలో కేసీఆర్ రాచరిక పాలన కొనసాగిస్తున్నారని, ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. ఇక ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యల నేపథ్యంలో  దీనిపై జోక్యం చేసుకోవాలని గీతారెడ్డి సహా ఇతర పార్టీల నాయకులు గవర్నర్ తమిళిసైను కలిసి విజ్ఞప్తి చేయనున్నారు..

 

 

ఆర్టీసీ కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారని ఆమె విమర్శించారు. ఆర్టీసీ కార్మికులతో కలిసి విపక్షాలు ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్నాయని ఐఏఎస్ అధికారి కోర్టుకు అఫడవిట్ ఇవ్వడాన్ని గీతారెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. ఈ విషయం పై త్వరలో కేంద్రంతో పాటు రాష్ట్రపతిని కూడా కలవాలని అఖిలపక్షం నేతలు నిర్ణయించినట్టు గీతారెడ్డి తెలిపారు... 

మరింత సమాచారం తెలుసుకోండి: