పుఖ్ ధనియా నైలైవనా అనే యజమాని అర్చిమండ్రిటే రకానికి చెందిన ఓ ఆడ బొద్దింకను పెంచుకుంటున్నాడు. అది తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతోంది. దీన్ని తెలుసుకున్న యజమాని బొద్దింకను క్లినిన్‌ కు తీసుకెళ్లాడు. ఆ వెటర్నరీ హాస్పిటల్‌ కు అంత బుల్లి పేషెంట్ రావడం అదే తొలిసారి. అయితే ఏంటి..? ఆ వైద్యులు తమ వృత్తి ధర్మాన్ని మరిచిపోకుండా.. దాని ప్రాణాలను ఎలాగైనా కాపాడాలనే నిర్ణయానికి వచ్చారు. వెంటనే దానికి వైద్య పరీక్షలు నిర్వహించారు.


గర్భంతో ఉన్న ఆ బొద్దింక తీవ్రమైన ప్రసవ సమస్యలతో బాధపడుతున్నట్లు డాక్టర్లు గుర్తించారు. అది గుడ్లు పొదిగే సంచి శరీరం నుంచి బయటకు వచ్చేసి, నేలకు అంటుకుంటోందని వారు తెలుసుకున్నారు. ఆ సంచి బయట ఉంటే దానికి ఇన్ఫెక్షన్‌ ఏర్పడుతుందని, అది బొద్దింక ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు ఆందోళన చెందారు. ఈ విషయాన్నీ యజమానికి చెప్పి.. ఒప్పించారు. యజమాని అనుమతితో ఆ బొద్దింకను నానో సర్జరీకి సిద్ధం చేశారు.


సర్జరీకి ముందు బొద్దింకకు నొప్పి తెలియకుండా అనేస్తేషియా (మత్తు) ఇచ్చారు. అనంతరం ఆ గర్భ సంచిలో ఉన్న గుడ్లను తొలగించారు. అనంతరం బయటకు వేలాడుతున్న గర్భసంచిని తొలగించారు. మొత్తానికి సర్జరీ విజయవంతమైందని, ఇకపై ఆ బొద్దింక ఎప్పటిలాగానే తిరగవచ్చని వైద్యులు తెలిపారు. దాని ప్రాణాలు కాపాడేందుకు గుడ్లను తొలగించాల్సి రావడం బాధకరమని, ఇకపై పిల్లలను కనలేదని తెలిపారు. 


రష్యాకు చెందిన ‘ఆర్టీ’ అనే వార్త సంస్థ నానో సర్జరీకి సిద్ధమవుతున్న బొద్దింక వీడియో ను పోస్టు చేసింది. బొద్దింక పొడవు సుమారు 8 సెంటీమీటర్లని పేర్కొంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్‌‌ గా మారింది. ఈ విషయం తెలిసి కొంత మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే.. ఇంకొందరు మాత్రం బొద్దింకకి సర్జరీ ఏంటని జోకులు పేలుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: